Call Ring TIme: 30 సెకన్ల పాటు కాల్ రింగ్ ఉండాలి, ల్యాండ్ లైన్ అయితే 60 సెకండ్లు, ట్రాయ్ తాజా నిర్ణయం, టెలికాం సంస్థల వార్ ముగిసినట్లే !
ఇకపై మొబైల్ ఫోన్‌కు చేసే ఇన్‌కమింగ్ కాల్స్ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది.
New Delhi, November 2: గత కొంత కాలంగా మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్‌కు చేసే ఇన్‌కమింగ్ కాల్స్ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది. ల్యాండ్‌లైన్స్‌కు చేసే కాల్స్‌కు అయితే 60 సెకన్ల పాటూ ఉండాలని ట్రాయ్ పేర్కొంది. అయితే ట్రాయ్ నిర్దేశకాలు జారీచేయడానికి ముఖ్య కారణం ఇప్పటివరకు టెలికాం కంపెనీలు పోటాపోటీగా ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించడమే. వాస్తవానికి గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు. జియో వచ్చిన తర్వాత టెలికాం రంగంలో కీలక మార్పులు జరిగాయి.
జియో రాకముందు ఎవరైనా కాల్ చేస్తే 45 సెకండ్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్‌కనెక్ట్ అయ్యేది. రిలయన్స్ జియో మొదట ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించింది. అనంతరం ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా అదేవిధంగా 25 సెకన్లకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ అవుతండడంతో వారు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఇకపై కాల్ ఎత్తకపోయినా లేదా రిజక్ట్ చేసినా ఇన్‌కమింగ్ వాయిస్ కాల్స్ అలర్ట్‌కు ఈ సమయాభావాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆపరేటర్లకు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయంతో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న పోటీకి తెరపడినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.