Syria President Flees: సిరియాలో అంతర్యుద్ధం.. రాజధాని డమాస్కస్ లోకి ప్రవేశించిన తిరుగుబాటు దళాలు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు బషర్
రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించాయి.
Newdelhi, Dec 8: సిరియాలో (Syria) అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ను గద్దె దించడమే లక్ష్యంగా తిరుగుబాటు గ్రూపులు, మిలిటెంట్ల బృందాలు రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించాయి. దీంతో బషర్ అల్ అస్సాద్ (Bashar Al-Assad) దేశం విడిచి పారిపోయారు. తిరుగుబాటుదారులు నగరంలోకి ప్రవేశించడానికి ముందే ఆయన గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా, తిరుగుబాటు దళాలకు శాంతియుతంగా అధికార మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిరియా ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలి ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.
50 ఏండ్ల పాలనకు ముగింపు
బషర్ అల్ అస్సాద్ దేశం విడిచి పారిపోవడంతో సిరియాలో గడిచిన 50 ఏళ్లుగా సాగుతున్న అతడి కుటుంబ పాలనకు ముగింపు పడినట్లయింది. గత 24 ఏళ్లుగా సిరియాలో అసద్ పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు 26 ఏండ్లు ఆయన తండ్రి పాలన సాగించారు.