![](https://test1.latestly.com/uploads/images/2025/02/gyanesh-kumar.jpg?width=380&height=214)
New Delhi, Feb 7: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా.. ప్రస్తుతం హరియాణా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి (1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి) నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ నేడు పదవీ విరమణ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం కొత్త సీఈసీ ఎంపిక కోసం సమావేశం జరిగింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమై జ్ఞానేశ్ కుమార్ పేరును ఖరారు చేశారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి పేరును ఖరారు చేశారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆయోదించారు. ఆ వెంటనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.
కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏండ్లు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో ఆయన హోంమంత్రిత్వ శాఖలో (కశ్మీర్ డివిజన్) సేవలు అందించారు. 370 రద్దు కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న జ్ఞానేశ్.. హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా గతేడాది జనవరి 31న రిటైర్డ్ అయ్యారు.
అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించిన పత్రాల వ్యవహారాన్ని.. హోం శాఖలో అదనపు కార్యదర్శిగా ఆయనే పర్యవేక్షించారు.శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, కేంద్ర సహకార శాఖల కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు.సీఈసీగా 2029 జనవరి 26వ తేదీ వరకూ కొనసాగనున్నారు.
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి.. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అప్పాయింట్‌మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీ్‌స)చట్టం-2023’ పేరుతో రూపొందించిన కొత్త చట్టం ప్రకారం సీఈసీ నియామకం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇక ఈయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే 2027లో జరుగుతాయి. మరోవైపు ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులైన వివేక్ జోషి హర్యాణా క్యాడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన హర్యాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆయనకు వీడ్కోలు పలికింది. రాజీవ్ కుమార్ 2020 సెప్టెంబరు 1 న కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా చేరారు. 2022 మే 15న దేశ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కమిషన్‌లో 4.5 సంవత్సరాల పాటు సాగిన ఆయన పదవీ కాలంలో అనేక సంస్కరణలు జరిగాయి. కాగా.. ఎన్నికల ఫలితాలను అంగీకరించలేని పార్టీలు.. ఎన్నికల కమిషన్‌ను బలిపశువును చేస్తున్నాయని వీడ్కోలు కార్యక్రమంలో రాజీవ్‌కుమార్ వ్యాఖ్యానించారు.