Taiwan Earthquake: తైవాన్ లో భారీ భూకంపం, జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4 గా నమోదు
బుధవారం తెల్లవారుజామున తైపీలో 7.5 తీవ్రతతో భూమి కపించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
Tokyo, April 03: తైవాన్ రాజధాని తైపీని భారీ భూకంపం (Taiwan Earthquake) వణికించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో 7.5 తీవ్రతతో భూమి కపించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. తైపీలోని ఓ బిల్డింగ్ కూలిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. గత 25 ఏండ్లలో భారీ భూకంపం రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
తైవాన్‌లో భూకంపంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్‌లోని దీవులకు సుమారు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది.
దాదాపు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది. సునామి వస్తున్నదని, అందరూ ఇండ్లు ఖాళీ చేయాలని జపనీస్ జాతీయ వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేస్తున్నది.
కాగా, తైవాన్‌లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. 1996లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది ప్రజలు మరణించారు. ఇక జపాన్‌లో ప్రతిఏటా సుమారు 1500 భూకంపాలు వస్తుంటాయి.