Kabul Airport Chaos: రక్తమోడుతున్న కాబూల్ ఎయిర్‌పోర్ట్, తాజాగా తొక్కిసలాటలో 7 మంది మృతి, తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో అదుపుతప్పిన పరిస్థితి, కాబూల్ విమానాశ్రయం వద్దకు ఎవరూ వెళ్లవద్దని అమెరికా హెచ్చరిక
తాలిబన్ల ఆధిపత్యం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున పౌరులు కాబూల్ విమానాశ్రయానికి (Kabul Airport Chaos) చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ తొక్కిసలాట జరిగింది.
Kabul, August 22: తాలిబన్లు రాకతో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తాలిబన్ల ఆధిపత్యం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున పౌరులు కాబూల్ విమానాశ్రయానికి (Kabul Airport Chaos) చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి (7 Afghan Civilians Dead) చెందినట్లు బ్రిటన్ రక్షణశాఖ (British Defence Ministry) తెలిపింది. తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.
తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు ఇండియాకు వచ్చారు. ఆదివారం ఉదయం కాబూల్‌లోని భారతీయులను తీసుకొచ్చిన సీ17 విమానంలోనే ఈ ఎంపీలతోపాటు 24 మంది సిక్కులు ఇండియాలో ల్యాండయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన సెనేటర్ నరేందర్ సింగ్ ఖాస్లా.. కంటతడి పెట్టారు. ఆఫ్ఘన్‌లో పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించగా.. ఎంపీ భావోద్వేగానికి గురయ్యారు. ఏడుపొస్తోంది. గత 20 ఏళ్లలో నిర్మించింది మొత్తం ఇప్పుడు నాశనమైపోయింది. అంతా శూన్యం అని నరేందర్ సింగ్ అన్నారు.
ఆదివారం ఉదయం సీ17 విమానంలో మొత్తం 168 ప్రయాణికులను కాబూల్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది. అందులో 107 మంది భారతీయులు ఉన్నారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి ప్రతి రోజూ రెండు విమానాలను నడిపేందుకు ఇండియాకు అనుమతి లభించింది. ఆదివారం ఇండియాలో ల్యాండైన వాళ్లలో చాలా రోజుల నుంచి కాబూల్‌లోని గురుద్వారాలో తలదాచుకుంటున్న వాళ్లు ఉన్నారు. వీళ్లను ఇప్పుడు ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాకు తరలించనున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్దకు ఎవరూ వెళ్లొద్దని అమెరికన్లను ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది. తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం అమెరికన్లు ఎంత మంది ఉంటారన్నది అమెరికా ప్రభుత్వానికి సమాచారం లేదు. తమ పౌరులపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటారేమోనని ఆందోళనగా ఉందని వైట్ హౌస్ కమ్యూనికేషన్ల డైరెక్టర్ కేట్ బెడింగ్ ఫీల్డ్ చెప్పారు. ఆఫ్ఘన్‌లో ఉన్న తమ పౌరులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టామన్నారు.