Afghanistan Crisis: తాలిబన్ల పాలనతో కాబూల్‌లో దారుణ పరిస్థితులు, దేశం విడిచేందుకు విమానాశ్రయానికి చేరుకున్న వేలాదిమంది ఆప్ఘన్లు, కాబూల్‌లో గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన అధికారులు
వేలాది మంది పౌరులు ఆఫ్గన్ విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి (Hamid Karzai International Airport) బారులు తీరారు.
అఫ్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న నేపథ్యంలో అక్కడ దారుణ పరిస్థితులు (Afghanistan Crisis) నెలకొన్నాయి. వేలాది మంది పౌరులు ఆఫ్గన్ విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి (Hamid Karzai International Airport) బారులు తీరారు. దీంతో ఆఫ్ఘన్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తాలిబన్ల రాజ్యంలో ఉండలేమంటూ వేల మంది దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే సోమవారం ఉదయం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు పెద్ద ఎత్తున ప్రజలు (Horrifying Scenes at Kabul Airport) తరలి వచ్చారు. అక్కడ ఉన్న ఒక్క విమానంలోకే ఎక్కడానికి ఇలా వేల మంది ఎగబడ్డారు. ఇంత భారీగా తరలి వస్తున్న జనాలను నియంత్రించ లేక అక్కడి మిగిలిపోయిన కొంత మంది అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. ఇప్పటికే పాకిస్థాన్ తమ సరిహద్దులను మూసేసింది. తాజాగా రాజధాని కాబూల్‌లో గగనతలాన్ని మూసివేసినట్లు (Flights Suspended) అధికారులు ప్రకటించారు.
దీంతో అక్కడి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. అక్కడ మిగిలిపోయిన భారతీయులను తీసుకురావడానికి సోమవారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానాలు అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.
Here's Horrifying Scenes at Kabul Airport
అంతేకాదు అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న పలు ఎయిరిండియా విమానాలను మరో మార్గంలో పంపే అవకాశాలు ఉన్నాయి. షికాగో నుంచి ఢిల్లీ వచ్చే విమానం, శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ వచ్చే విమానాలను గల్ఫ్ దేశాలకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఆదివారం నుంచీ కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను వేల మంది ప్రజలు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడి విమానాల్లోకి ఎక్కడానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో అక్కడే ఉన్న అమెరికా దళాలు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.