Alexei Navalny Dies: రష్యా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష నేత జైలులో మృతి, వాకింగ్ చేస్తూ అస్వస్థతకు గురై అలెక్సీ నావల్నీ మరణించారని తెలిపిన రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్
ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో ఆయన మరణించినట్లు రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేసింది
Moscow, Feb 16: రష్యా (Russia)లో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) జైలులో మృతి చెందారు. ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీలో ఆయన మరణించినట్లు రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.వాకింగ్ తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారని, వెంటనే స్పృహ కోల్పోవడంతో వైద్య సేవలు అందిచామని అయినా ఫలితం లేకపోయిందని ప్రకటనలో తెలిపింది. ఆయన మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో నావల్నీ మరణం చర్చనీయాంశంగా మారింది.
నావల్ని పలు కేసుల్లో జైలు శిక్ష విధించడంతో మూడేళ్లుగా రాజధాని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో ఆయన జైలు నుంచి అదృశ్యమైనట్లు వార్తలు హల్ చల్ చేశాయి. ఇక 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనపై విషప్రయోగం జరగడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. నరాల్లోకి విషపూరిత ఇంజెక్షన్‌ను ఎక్కించడంతో జర్మనీలో కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్నారు.
చికిత్స అనంతరం 2021 జనవరిలో రష్యాకు తిరిగి రాగా ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగం సహా పలు అభియోగాలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు రష్యా అధికారులు నాడు వెల్లడించారు. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా వివిధ కేసుల్లో 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న ఏకైక నాయకుడు ఈయన ఒక్కడే.
ఇక కెనడాకు చెందిన దర్శకుడు డేనియల్ రోహెర్ ఆయన జీవిత కథ ఆధారంగా ‘నావల్నీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. గతేడాది ఈ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం లభించింది.