Moscow, Dec 8: రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ఇంతరవకు ప్రకటించలేదు.అయితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని ఆ దేశ మీడియా చెబుతోంది. ఈ నేఫథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్ష పదవిని ఐదోసారి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ, ‘ఓపిక పట్టండి’ అని చెప్పారు. దేశాధ్యక్ష ఎన్నికలను వచ్చే సంవత్సరం మార్చి 17న నిర్వహించాలని నిర్ణయించారు. పుతిన్ ప్రత్యర్థుల్లో అత్యధికులు జైళ్లలో కానీ, విదేశాల్లో కానీ ఉన్నారు. కాబట్టి ఆయన మరోసారి ఆ పదవికి ఎన్నిక కావడం లాంఛనమేనని విశ్లేషకులు చెప్తున్నారు.
వ్లాదిమిర్ పుతిన్ రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో కొనసాగుతున్నారు. సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కన్నా ఎక్కువకాలం పాటు పదవిలో కొనసాగారు. ఆరేళ్ల ఆయన పదవీ కాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ, పుతిన్ తీసుకువచ్చిన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంది.
రాజ్యాంగ సంస్కరణల్లో భాగంగా పుతిన్ తెచ్చిన ఆ ప్రతిపాదనకు మద్దతుగా అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు. దానికి చట్టసభ సభ్యులు కూడా మద్దతు పలికారు. రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టున్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక కావడం తథ్యమని భావిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు జైళ్లలోనో, విదేశాల్లోనో ఉండిపోయారు.
రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు.. రష్యా దిగువ సభ డూమాలో గానీ కనీసం మూడో వంతు ప్రాంతీయ శాసనసభలలో ప్రాతినిధ్యం లేని పార్టీ ద్వారా 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి కనీసం లక్ష సంతకాలను సేకరించాలి. ఏ పార్టీకీ సంబంధం లేకుండా పోటీ చేసే వారికి కనీసం 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి 3 లక్షల సంతకాలు అవసరం. ఈ నిబంధనలు పుతిన్‌కు సైతం వర్తిస్తాయి.
రాజ్యాంగ సంస్కరణల్లో భాగంగా పుతిన్ తెచ్చిన ఆ ప్రతిపాదనకు మద్దతుగా అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు. దానికి చట్టసభ సభ్యులు కూడా మద్దతు పలికారు.