USA Airstrikes on ISIS Camps: సిరియాపై అమెరికా బాంబుల వర్షం, ఐసీస్ స్థావరాలను టార్గెట్ చేశామని యూఎస్ ప్రకటన, తమపై దాడులకు కుట్ర చేస్తుందనే సమాచారంతోనే క్షిపణి దాడులు
సిరియాలోని (Syria) ఐసీస్ (ISIS) ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు (Airstrikes In Syria) చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Syria, OCT 12: అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని (Syria) ఐసీస్ (ISIS) ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు (Airstrikes In Syria) చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలపై ఐసీస్ దాడులు చేసేందుకు కుట్ర చేస్తోందని అమెరికాకు కచ్చితమైన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమై.. ముందుగానే సిరియాలోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది.
USA Airstrikes on ISIS Camps
ఇప్పటి వరకు చోటు చేసుకున్న దాడుల్లో సిరియాలోని సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అమెరికా (America) తెలిపింది. ఇటీవలి కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబర్ నెల చివరిలో ఐసీసీ లక్ష్యంగా అమెరికా గగనతల దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 37 మంది టెర్రరిస్టులు హతమైనట్లు ప్రకటించింది. ఆ ఉగ్రవాదులంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, ఆల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని తెలిపింది.
ప్రస్తుత దాడులతో ఐసీస్ శక్తిసామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే, మిత్ర దేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారిని సహించబోమని అగ్రరాజ్యం తేల్చిచెప్పింది.