US Election Results 2020: అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే దిశగా జో బిడెన్, మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో డెమొక్రాటిక్ అభ్యర్థి, కొనసాగుతున్న కౌంటింగ్, ఎన్నికల ప్రక్రియ అంతా ఫ్రాడ్ అని కోర్టును ఆశ్రయించిన డొనాల్డ్ ట్రంప్ బృందం
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలో 214 ఓట్లతో ఉండటాన్ని బట్టి చూస్తే ఇక ఆయన వైట్ హౌజ్ ఖాళీ చేయాల్సిందేనని తేలిపోయింది....
Washington, November 5: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 270 అవసరం అవుతుండగా బిడెన్ 264 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో ముందంజలో ఉన్నారు. వైట్ హౌస్ సు స్వాధీనం చేసుకోవడానికి ఆయన ఇప్పుడు కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది, అరిజోనా, మిచిగాన్ మరియు విస్కాన్సిన్ రాష్ట్రాలను బిడెన్ గెలుచుకుంటారని అంచనా. మరో రాష్ట్రం నెవాడాలో కూడా బిడెన్ మరియు ట్రంప్ ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక ఇది గనక బిడెన్ కైవసం చేసుకుంటే అధికారికంగా ఆయన మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసినట్లు అవుతుంది.
ఇప్పటికే అగ్రరాజ్య పీఠం ఎవరికి దక్కబోతోందో దాదాపు తేలిపోయింది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా మరియు జార్జియా లాంటి పెద్ద రాష్ట్రాలను కైవసం చేసుకున్నప్పటికీ, మొత్తంగా ఆయన 214 ఎలక్ట్రోరల్ ఓట్లు మాత్రమే సాధించగలిగారని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) తెలిపింది.
ఇక ఈ ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్న ట్రంప్, ఈ మొత్తం ప్రక్రియలో బిడెన్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. మిచిగాన్, పెన్సెల్వేనియా ఫలితాల్లో మోసాలు జరిగాయని ట్రంప్ బృందం యూఎస్ సుప్రీంకోర్టులో దావా వేసింది. అదేరకంగా, ట్రంప్ గెలుస్తారనుకున్న విస్కాన్సిన్ రాష్ట్రంలో కూడా బిడెన్ విజయకేతనం ఎగురవేయడంతో ట్రంప్ శిబిరం విస్మయం వ్యక్తం చేసింది. ఇక్కడ రీకౌంటింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో మొత్తం ఉన్న 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు కనీసం 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి అర్హులు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలో 214 ఓట్లతో ఉండటాన్ని బట్టి చూస్తే ఇక ఆయన వైట్ హౌజ్ ఖాళీ చేయాల్సిందేనని తేలిపోయింది. ఫలితాల్లో నువ్వానేనా అన్నట్లు తలపడిన ట్రంప్ కొన్ని కీలకమైన రాష్ట్రాలలో ఓటమి చవిచూసి రెండో సారి అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఇక విజయానికి 6 ఓట్ల దూరంలో ఉన్న బిడెన్ నెవాడా రాష్ట్రంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ ప్రకారంగా ఆయన అనుకున్న మ్యాజిక్ ఫిగర్ సాధిస్తున్నారు. 77 ఏళ్ల బిడెన్ 46వ అమెరికా అధ్యక్షుడిగా అవతరించబోతున్నారు.
.