Brazil Protests: బ్రెజిల్‌‌లో రెచ్చిపోయిన నిరసనకారులు, అత్యంత కీలకమైన భవనాలపై దాడి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచాధి నేతలు, జైర్‌ బోల్సొనారో ఓటమిని అంగీకరించని మద్దతుదారులు

రాజధాని బ్రసీలియాలోని దేశ అధికార కేంద్రాలైన నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనాలను ముట్టడించారు.

Pro-Bolsonaro protesters storm Brazilian government buildings. (Photo Credit: Twitter/@ianbremmer)

Brasillia, Jan 10: బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మద్దతుదారులు దేశంలో అరాచకం (Brazil Protests) సృష్టించారు. రాజధాని బ్రసీలియాలోని దేశ అధికార కేంద్రాలైన నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనాలను ముట్టడించారు.ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్‌ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో (Jair Bolsonaro, Former Brazilian President) ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, కాంగ్రెస్, సుప్రీంకోర్టు భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు.

దేశాధ్యక్షుడిగా లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా వారం క్రితమే అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆదివారం వేలమంది బోల్సొనారో మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని కీలక భవనాల్లోకి (Supporters Storm Government Buildings in Brasilia) చొరబడ్డారు.ఆ సమయంలో భవనాల్లో ఎవరూ లేరు. కొందరు ఆందోళనకారులు అక్కడ కిటికీలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. సైన్యం జోక్యం చేసుకుని బోల్సొనారోకు అధికారం కట్టబెట్టాలని లేదా లూలాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.

ముచ్చటగా మూడోసారి, బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్లా ప్రమాణ స్వీకారం, బ్రెజిల్‌ను పునర్నిర్మిస్తానని హామీ

దాదాపు మూడు వేల మందికిపైగా అల్లరి మూకలు వీటిల్లో పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు. వారిని చెదరగొట్టడానికి సుప్రీంకోర్టు వద్ద భద్రతా దళాలు హెలికాప్టర్ల నుంచి టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించాయి. అల్లర్లను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులు, పోలీసులపైనా దుండగులు దాడులకు దిగారు. కొన్ని గంటల అనంతరం పోలీసులు 12వందల మంది నిరసనకారులను అరెస్టుచేసి మూడు భవనాలను తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

నిరసనకారులు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చొనే ప్రధాన బల్లాను ధ్వంసంచేశారు. కోర్టు ఆవరణలోని పురాతన విగ్రహాన్ని కూలదోశారు. ‘‘బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలి. డ సిల్వాను దింపేయాలి’’ అని డిమాండ్‌చేస్తున్నారు. భవనాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లనూ ధ్వంసంచేశారు. వారాంతం కావడంతో భవనాల్లో సిబ్బంది అంతగా లేరు.ఊహించని ఘటనతో ఉలిక్కిపడిన సైన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది.

బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రస్తుత ప్రెసిడెంట్‌ జైర్‌ బోల్సోనారో

భవనాల ప్రాంగణాల్లోని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌లను ప్రయోగించింది. 300 మందిని అరెస్ట్‌చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని బోల్సోనారో ఒప్పుకోక మద్దతుదారులను ఉసిగొల్పడం ఇంతటి ఆందోళనకు కారణమైంది. రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంట్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన గుర్తుకుతెచ్చింది.

ఆందోళనలపై డ సిల్వా ఆగ్రహించారు. ‘‘ఫాసిస్ట్‌ శక్తులు చెలరేగిపోయాయి. దీనిపై సత్వరం స్పందించని పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అన్నారు. ఇలాంటి ఘటన జరిగే ప్రమాదముందని కొన్నినెలలుగా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తుండటం గమనార్హం. గత ఏడాది అక్టోబర్‌ 30న డ సిల్వా గెలుపు తర్వాత మొదలైన నిరసనలు ఆనాటి నుంచి ఆగలేదు. రోడ్ల దిగ్బంధం, వాహనాల దగ్ధం, సైన్యం జోక్యంచేసుకోవాలంటూ సైనిక కార్యాలయాల వద్ద ఆందోళనకారుల బైఠాయింపులతో నిరసనలు దేశమంతటా కొనసాగుతుండటం తెల్సిందే.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సొనారోకు 49.1శాతం వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు. దేశంలోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన ఆరోపిస్తున్నారు.

ప్రపంచ దేశాధినేతల ఆందోళన

బ్రెజిల్‌లో అధికార కేంద్రాలైన ప్రధాన భవనాలపై దాడిని పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. ‘ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ప్రతి చర్యనూ ఖండిస్తాం. పాలనలో అధ్యక్షుడు డ సిల్వాకు సాయంగా ఉంటాం’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యానించారు. ‘ ఎన్నికల ద్వారా డ సిల్వా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజాభిష్టాన్ని గౌరవించాలి’ అంటూ దాడులను ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ తీవ్రంగా తప్పుబట్టారు. బ్రసీలియాలో ప్రభుత్వ భవనాల విధ్వంసం వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. బ్రెజిల్‌ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.