ISRO Aditya-L1 Coming Soon: చంద్రయాన్-2తో కథ ముగిసిపోలేదు, ఆదిత్య ఎల్1తో సత్తా చాటుతాం, విక్రమ్ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ వైఫల్యంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, సాఫ్ట్ లాండింగ్ ని నిజం చేసి చూపుతామన్న ఇస్రో ఛైర్మెన్ కె శివన్
వచ్చే కాలంలో అత్యాధునిక శాటిలైట్ లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.ఐఐటీ ఢిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టాఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.
New Delhi, Novemebr 4: చంద్రయాన్-2 ప్రయోగంతో సాంకేతికతపరంగా ఇస్రో ముందుకు వెళ్లిందని ఇస్రో చైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే కాలంలో అత్యాధునిక శాటిలైట్ లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.ఐఐటీ ఢిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టాఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామని వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2 విఫలం అయినప్పటికీ ఆ ప్రయోగం ద్వారా ఎన్నో విషయాలు తెలిశాయని, విక్రమ్ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయించటంలో విఫలమైనప్పటికీ, అందులో తమకు ఎంతో విలువైన సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు చివరి వరకూ విక్రమ్ రోవర్‌లో అన్ని వ్యవస్థలూ సక్రమంగానే పనిచేశాయన్నారు. జాబిల్లి ఉపరితలంపై 300 మీటర్ల దూరం వరకు సాంకేతికంగా అన్ని వ్యవస్థలూ సరిగ్గానే పనిచేశాయి. దీంతో సాఫ్ట్ ల్యాండింగ్‌కు సంబంధించి పొరపాట్లు జరగకుండా పరిశోధన జరిపే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
అందుకే అదే అనుభవంతో భవిష్యత్తులో చంద్రుడిపై కచ్చితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని శివన్ ధీమా వ్యకం చేశారు. భవిష్యత్తులో తాము మరింత అత్యాధునిక సాంకేతికత కలిగిన ఉపగ్రహాలను ప్రయోగిస్తామని శివన్ అన్నారు. కాగా ఇస్రో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని సిద్ధం చేస్తున్నసంగతి తెలిసిందే. ఆదిత్య ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధమైందని, ఆదిత్యఎల్1 మానవ రహిత అంతరిక్ష యాత్రపై తమ దృష్టి నిలిపామని శివన్ తెలిపారు.
విద్యార్థుల గురించి ప్రస్తావిస్తూ.. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో డబ్బు కోసం కాకుండా లక్ష్యం కోసం పనిచేయాలని సూచించారు.మీకు నైపుణ్యం, ఆసక్తి ఉన్న రంగంలో ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకుని ముందుకుసాగాలని విద్యార్థులకు శివన్ సూచించారు. అయితే విజయం సాధించడమన్నది కేవలం అభిరుచిపైనే ఆధారపడి ఉండదనీ, విజయానికి అభిరుచి దోహదపడగలదని మాత్రమే గుర్తించాలని అన్నారు.
ప్రస్తుతం గగన్‌యాన్, ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌పైనే దృష్టి పెట్టామన్నారు. వచ్చే కొన్ని నెలల్లో పెద్ద సంఖ్యలో అడ్వాన్స్‌డ్ శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేశామని తెలిపారు. డిసెంబర్ లేదా జనవరిలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ) రాకెట్ తొలి ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 200 టన్నుల సెమీ క్రయో ఇంజన్ టెస్టింగ్ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుందన్నారు.
మన సొంత నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ ను మొబైల్ ఫోన్లలో ఉపయోగించేందుకు కూడా ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఐఐటీలు టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు ‘అక్షయ పాత్ర’ వంటివని శివన్ అన్నారు. అవకాశాలను వాడుకోవడంలో పాత తరాల వాళ్ల కంటే ఈ తరం వాళ్లు తెలివిగా ఉన్నారన్నారు.
ఇదిలా ఉంటే చంద్రయాన్ 2 ఆర్బిటర్ మరో కీలక సమాచారాన్ని పంపింది. జాబిల్లి వాతావరణంలో ఆర్గాన్ 40 వాయువు ఉనికిని గుర్తించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్‌లో ఉన్న ‘చంద్రాస్ అట్మాస్పెరిక్ కాంపొజిషన్ ఎక్స్ ప్లోరర్ 2 (చేజ్ 2)’ పేలోడ్ దీనిని గుర్తించిందని ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. ఈ వాయువు టెంపరేచర్లు, ప్రెజర్లను బట్టి రాత్రిపూట చంద్రుడి ఉపరితలంపై చాలా దట్టంగా ఉంటోందని, పగలు అయ్యేసరికి ఇది తేలికగా మారి చంద్రుడి వాతావరణంలోని ఎక్సో స్పియర్‌కు చేరుతోందని కనుగొంది.
వాస్తవానికి ఇది ఆర్గాన్ మూలకానికి ఉన్న ఐసోటోప్ (మారురూపం)లలో ఒకటి. చంద్రుడి నేలలో చాలా లోతున పొటాషియం 40 మూలకం రేడియోయాక్టివ్ డిసింటిగ్రేషన్‌కు గురికావడం వల్ల ఆర్గాన్ 40 ఏర్పడుతోందని, చంద్రుడి ఉపరితలంలోని పగుళ్ల ద్వారా వాతావరణంలోకి వెళ్తోందని సైంటిస్టులు చెప్పారు.