China Flight Fire: చైనాలో రన్ వే పై ఉన్న విమానంలో మంటలు, తృటిలో తప్పిన ప్రమాదం, 113 మంది ప్రయాణికులు సురక్షితం, వీడియో వైరల్..
టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం ఉదయం చాంగ్‌కింగ్ జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయం లో అగ్నిప్రమాదానికి గురయింది. , అయితే ప్రయాణీకులు, సిబ్బంది అందరూ "సురక్షితంగా తప్పించుకున్నారు" అని విమానయాన సంస్థ తెలిపింది.
బీజింగ్, మే 12: చైనాలో మరో విమాన ప్రమాదం జరిగింది. టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం ఉదయం చాంగ్‌కింగ్ జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయం లో అగ్నిప్రమాదానికి గురయింది. , అయితే ప్రయాణీకులు, సిబ్బంది అందరూ "సురక్షితంగా తప్పించుకున్నారు" అని విమానయాన సంస్థ తెలిపింది.
ఈ విమానంలో 113 మంది ప్రయాణికులతో పాటు 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు.
ఫ్లైట్ చాంగ్‌కింగ్ నుంచి టిబెట్‌లోని న్యింగ్చికి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అయ్యేందుకు రన్‌వే నుంచి బయలుదేరిన కాసేపటికే ఓ విమాన రెక్క భాగం నుంచి మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని నిలిపివేశారు. అనంతరం విమానంలో ఉన్న ప్రయాణికులను కిందికి దించేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు అక్కడి నుంచి పారిపోయారు. చైనా ప్రభుత్వ మీడియా షేర్ చేసిన వీడియోలు మంటలను చూపించాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విమాన సిబ్బందితో పాటు ఎయిర్ పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించడంతో ముప్పు తప్పింది. లేదంటే ఘోరం జరిగి ఉండేది. మంటల కనిపించిన వెంటనే.. పైలట్లు విమానం నిలిపివేశారు. అనంతరం వెనక డోర్ నుంచి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. అనంతరం ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 113 మంది ప్రయాణికులు, తొమ్మది మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని.. టిబెట్ ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది. ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.