Influenza Outbreak in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్, వణికిస్తున్న కొత్త ఫ్లూ ఇన్‌ఫ్లూయెంజా కేసులు, జియాన్ ఫ్రావిన్స్‌లో కరోనా తర్వాత తొలిసారిగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు
ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా జియాన్ నగరంలో కరోనా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు
బీజింగ్, Mar 13: చైనాలో కరోనా తర్వాత మళ్లీ కొత్త ఫ్లూ విశ్వరూపం చూపిస్తోంది. ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా జియాన్ నగరంలో కరోనా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. గత వారంతో పోల్చితే పాజిటివిటీ రేటు 25.1 శాతం నుంచి 41.6 శాతానికి పెరిగినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోయింది.
ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని నియంత్రించేందుకు కరోనాకు తీసుకున్న చర్యలే తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్కూళ్లు, వ్యాపార కార్యకాలాపాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. జియాన్ నగరంలో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు. అధికారుల లాక్‌డౌన్ నిర్ణయాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. లాక్‌డౌన్ విధించడం కంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఉత్తమమని జియాంగ్ నగరవాసులు చెబుతున్నారు. వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
ఇక ప్రధాన పర్యాటక కేంద్రమైన జియాన్ లో ఫ్లూ కేసులను నియంత్రించేందుకు జన రద్దీ ప్రాంతాలతోపాటు స్కూళ్లు, వ్యాపారాలు మూసివేస్తామని పేర్కొంది. హాంకాంగ్ వైరస్‌గా వ్యవహరించే హెచ్3ఎన్2 (H3N2) కేసులు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. చైనాలో కూడా గత వారం ఇన్‌ఫ్లూయెంజా కేసులు బాగా పెరిగినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం విడుదల చేసిన వీక్లీ కోవిడ్ రిపోర్ట్‌లో పేర్కొంది.
మరోవైపు భారత్, చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్ వైరస్‌గా పిలిచే హెచ్3ఎన్2 (H3N2) వైరస్ వల్ల పలు మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారికి సాధారణ ఫ్లూ వైరస్ మాదిరిగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, శరీరంలో నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయని వైద్య నిఫుణులు చెబుతున్నారు. అలాగే కరోనా మాదిరిగా మరో మహమ్మారిగా ఇది వ్యాప్తి చెందుతుందేమో అన్న భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు.