Coronavirus Effect: ఖైదీలకు బెయిల్ ఇచ్చిన కరోనావైరస్, కరోనా భయంతో 70,000 వేల మంది ఖైదీలను విడుదల చేసిన ఇరాన్ దేశం, వారితో సమాజానికి ఎలాంటి అభద్రత ఉండదని సమర్థత
ఈ క్రమంలోనే ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న 70 వేల మంది ఖైదీలకు తాత్కాలిక స్వేచ్ఛ కలిపించింది.....
Tehran, March 10: చైనా దేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనావైరస్ (Coronavirus) తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్న వేళ, ఇరాన్ (Iran) దేశంలోని ఖైదీలకు మాత్రం అదే వరమైంది. ఎక్కడైనా ఖైదీలను విడుదల చేయాలంటే వారి సత్ప్రవర్తన ఆధారంగా కోర్టు అనుమతితో ఇతరుల పూచీకత్తుపై ఏ రిపబ్లిక్ డే నాడో, ఇంకేదైనా జాతీయ పండుగ రోజున ఎన్నో షరతులు పెట్టి విడుదల చేస్తారు. అయితే దీనికి భిన్నంగా కరోనావైరస్ వ్యాప్తి భయంతో ఇరాన్ ప్రభుత్వం సుమారు 70,000 మంది ఖైదీలను (70k Prisoners) విడుదల చేసింది.
ఇరాన్ దేశంపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఇరాన్ దేశంలో 7,161 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, మరియు ఈ వైరస్ బారిన పడి ఇరాన్ దేశంలో మరణించిన వారి సంఖ్య 237కు చేరింది. తమ దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి ఇరాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కువ మంది ఒకేచోట కలిసున్న చోట కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు చెప్పిన నేపథ్యంలో జనం ఒకే చోట ఉండకుండా ఇరాన్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న 70 వేల మంది ఖైదీలకు తాత్కాలిక స్వేచ్ఛ కలిపించింది. విడుదల చేసిన వారందరికీ 'బెయిల్' మంజూరైనట్లుగా జైళ్ల శాఖ తమ రికార్డుల్లో నమోదు చేసుకుంది.
ఖైదీల విడుదలను ఇరాన్ ప్రభుత్వం సమర్థించుకుంది. వీరి విడుదల వలన సమాజంలో భద్రతకు వచ్చిన ముప్పేమి లేదని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఇబ్రహీం రైసీ పేర్కొన్నారు. అయితే విడుదల చేసిన నేరస్తులను మళ్ళీ జైళ్లలో వేస్తారా, లేదా? అనే దానిపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. Coronavirus: ఆంధ్రప్రదేశ్ లో 3, దేశవ్యాప్తంగా 52, పూర్తి జాబితా ఇక్కడ చూడండి
మరోవైపు కరోనావైరస్ ప్రభావంతో ఇరాన్ మార్కెట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారమైన ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా భారీ స్థాయిలో పతనమయ్యాయి. గతంలో 1991 గల్ఫ్ యుద్ధం తలెత్తిన సంక్షోభం నాటి పరిస్థితులను ఇప్పుడు ఇరాన్ దేశం ఎదుర్కోంటోంది.