COVID Outbreak in China: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు, పలు ప్రావిన్స్‌ల్లో లాక్‌డౌన్ అమల్లోకి..
గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజుకు వేయికి పైగా కేసులు నమోదు కావడం గత రెండేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.
Beijing, March 11: చైనాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజుకు వేయికి పైగా కేసులు నమోదు కావడం గత రెండేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. మూడు వారాల క్రితం 100కు దిగువన ఉన్న కేసుల సంఖ్య కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1369 కొత్త కేసులు నమోదయ్యాయంటే కరోనా కల్లోలం అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా డజనకు పైగా ప్రావిన్స్ లలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఒక్కరోజే చాంగ్‌చున్ పట్టణంలో 397 కరోనా కేసులు నమోదుకాగా, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 1,369కి చేరింది. చాంగ్‌చున్ పట్టణ పరిధిలో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్నారు.
దీంతో చాంగ్‌చున్ సిటీ మొత్తం ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. మరోవైపు కరోనా టెస్టులు కూడా విపరీతంగా చేస్తున్నారు. ఇక ప్రధాన నగరాలైన షాంఘై, ఇతర నగరాల్లో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు. కరోనా కట్టడికి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా ఒక్క కేసు నమోదైనా లక్షల కొద్ది పరీక్షలు చేస్తున్న సంగతి విదితమే.