Covid Variants Get New Names: కరోనా వేరియంట్లకు కొత్త పేర్లను సూచించిన డబ్ల్యూహెచ్‌వో, భారత్‌లో ఉన్న బీ.1.617.2, బీ.1.617.1 వేరియంట్లను డెల్టా, కప్పాగా పిలవాలని సూచన, గ్రీక్ అక్షరమాలను అనుసరించి నామకరణం
ప్రస్తుతం భారత్‌లో విజృంభిస్తున్న కరోనా రెండు వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2 వైరస్‌లకు నామకరణం (WHO Announces Labels of Coronavirus Variants ) చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
Geneva, June 1: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన నూతన వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్లు పెట్టేసింది. ప్రస్తుతం భారత్‌లో విజృంభిస్తున్న కరోనా రెండు వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2 వైరస్‌లకు నామకరణం (WHO Announces Labels of Coronavirus Variants ) చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వీటిని కొవిడ్-19 వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీవోసీ)లుగా ప్రకటించింది. అంటే ఆందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్లు అని అర్ధం.
వీటిలో బి.1.617.2 వేరియంట్‌కు ‘డెల్టా’(Delta) అని పేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. బి.1.617.1 వేరియంట్‌కు ‘కప్పా’(Kappa) అని నామకరణం చేసింది. ఈ బి.1.617 కరోనా వేరియంట్ ఇప్పటి వరకూ 53 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇకపై బీ.1.617.2 వేరియంట్‌ను ‘డెల్టా వేరియంట్’గా పిలువాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సోమవారం పేర్కొంది. బీ.1.617.2 వేరియంట్‌ను కొన్ని పత్రికలు, సంస్థలు ‘భారత వేరియంట్’గా పిలవడంపై కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బీ.1.617.2 వేరియంట్‌ను ‘భారత వేరియంట్’గా పేర్కొంటూ ప్రచారమవుతున్న కంటెంట్‌ను తొలగించాలని అన్ని సోషల్‌మీడియా వేదికలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దేశాలను బట్టి వేరియంట్లకు పేర్లు పెట్టడం తగదని మే 12న డబ్ల్యూహెచ్‌వో (WHO) ఓ ప్రకటన చేసింది. వేరియంట్లను తాము శాస్త్రీయ పేర్లతోనే పిలుస్తున్నట్టు, అందరూ అలాగే పిలువాలని వెల్లడించింది. సార్స్‌కోవ్2 వేరియంట్లను గురించి ప్రజలు సులభంగా చర్చించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్ విభాగానికి చెందిన మరియా వాన్ కెర్ఖోవ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Here's ANI Update
తాజాగా వేరియంట్లకు గ్రీక్ అక్షరమాలను అనుసరించి నామకరణం చేసింది. ఈ విధానంతో సులభంగా వేరియంట్లను గుర్తుపట్టొచ్చని వివరించింది. కాగా, బీ.1.617.2 వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నదని, వేగంగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటివరకూ అధికారికంగా 53 దేశాల్లో, అనధికారికంగా మరో ఏడు దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది.
డబ్ల్యూహెచ్‌వో కొత్తగా నామకరణం చేసిన పేర్లు ఇవే
బీ.1.617.2 భారత్ డెల్టా
బీ.1.617.1 భారత్ కప్పా
బీ.1.1.7 బ్రిటన్ ఆల్ఫా
బీ.1.351 దక్షిణాఫ్రికా బీటా
పీ.1 బ్రెజిల్ గామా
బీ.1.427 అమెరికా ఎప్సిలాన్
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ను పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దాని నిర్మాణంలో మార్పులకు సూచనలు అందించాల్సిందిగా కోరుతున్నారు. భవిష్యత్‌లో ఏదైనా అంటువ్యాధిని నియంత్రించేందుకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఒప్పందం నిర్మాణం, నిబంధనల్లో మార్పు కోసం ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రవేశపెట్టింది.
ఇప్పటివరకు 17 కోట్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 37 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ 194 సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు నవంబర్ 29 న సమావేశమై సంస్థ నిర్మాణాన్ని ఎలా సమర్థవంతంగా తయారు చేయాలో నిర్ణయిస్తారు. ఇది భవిష్యత్‌లో మరే ఇతర అంటువ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడగలదని నమ్ముతున్నారు.
అంటువ్యాధులను ఎదుర్కోవటానికి సంస్థను మరింత మెరుగుదల చేసేందుకు సూచనలను స్వాగతిస్తున్నామని సంస్థ అత్యవసర వ్యవహారాల డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. భవిష్యత్‌లో తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడం సులభతరం చేసేలా సూచనలు ఉండాలని మైక్ ర్యాన్ పేర్కొన్నారు. 2020 ప్రారంభంలో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రతను గుర్తించడంతోపాటు దానిని నిరోధించడంలో ఘోరంగా విఫలమైందని డబ్ల్యూహెచ్ఓపై విమర్శలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓకు మరిన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యకర వాతావరణాన్ని అందించేందుకు వీలుచిక్కుతుందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.