900 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర మక్కా యాత్రలో ఆగని మృత్యుఘోష, 90 మంది భారతీయులతో సహా 900 మంది మృతి, సౌదీ అరేబియాలో దంచికొడుతున్న ఎండలు

ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు గురువారం ధృవీకరించారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి.

Muslim Pilgrims Circumambulate The Kaaba, The Cubic Building At The Grand Mosque, During The Annual Hajj Pilgrimage In Mecca, Saudi Arabia (Photo: PTI)

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు గురువారం ధృవీకరించారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్‌ యాత్రికులు (Hajj Pilgrims) అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడికి యాత్రికులు మృత్యువాత పడుతున్నారు.

హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 90 మంది భారతీయులు(Indians) మరణించారని అధికారులు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 900 మంది మృతి చెందారు. వీటిలో అత్యధిక మరణాలు వడదెబ్బ కారణంగానే జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 18.3 లక్షల మంది హజ్ యాత్రకు హాజరయ్యారు. హజ్ యాత్రలో మృతి చెందిన వారిలో 300 మంది ఈజిప్టు వాసులు ఉన్నారు. పవిత్ర మక్కాలో మృత్యుఘోష, హజ్‌ యాత్రకు వెళ్ళిన 550కి పైగా యాత్రికులు మృతి, ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు

మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో వృద్ధులు వేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నారు. ఈ యాత్రకు హాజరైన వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు. వివిధ కారణాలతో చనిపోయిన యాత్రికులు మృతదేహాలను మక్కాలోని అల్-ముయిసెమ్‌ ఆసుపత్రిలో భద్రపరిచామని, కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నట్లు చెప్పారు. ఈజిప్ట్‌, జోర్దాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు (Egyptians) కాగా, 90 మందికిపైగా జోర్డానియన్లు మ‌ర‌ణించినట్లు తెలిపారు. మరోవైపు అదృశ్యమైన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని ఈజిప్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనీషియా, ఇరాక్, కుర్దిష్ ప్రాంతానికి చెందిన వాళ్లు కూడా మృతుల్లో ఉన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మూడు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోయారు.

గతేడాది 240 మరణాలు నమోదుకాగా.. వీరిలో ఇండోనేషియాకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. అసలే ఎడారి ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని యాత్రికులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హజ్‌కి వచ్చే యాత్రికులకు సూచిస్తున్నారు. ముస్లింలు హజ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీవిత కాలంలో ఒకసారైనా ఈ యాత్రకు వెళ్లాలని అనుకుంటారు.