Hindenburg vs Block: అదాని తర్వాత ట్విట్టర్ ఫౌండర్‌ని టార్గెట్ చేసిన హిండెన్‌బర్గ్, జాక్ డోర్సీ పేమెంట్స్ సంస్థ బ్లాక్ అక్రమాలకు పాల్పడిందని నివేదిక
ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. జాక్ డోర్సీ (Twitter Co-Founder Jack Dorsey) ఆధ్వర్యంలోని పేమెంట్స్ సంస్థ బ్లాక్ (Block Inc) అక్రమాలకు పాల్పడిందని నివేదికను బయటపెట్టింది.
గౌతం అదాని సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన యూఎస్ షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ మరో సంచలనానికి తెరలేపింది. ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. జాక్ డోర్సీ (Twitter Co-Founder Jack Dorsey) ఆధ్వర్యంలోని పేమెంట్స్ సంస్థ బ్లాక్ (Block Inc) అక్రమాలకు పాల్పడిందని నివేదికను బయటపెట్టింది. ఈ బ్లాక్ సంస్థ భారీ అక్రమాలు చేసిందని పేర్కొంటూ హిండెన్‌బర్గ్ తన ట్విట్టర్ ఖాతాలో సంబంధిత నివేదిక లింక్‌ను ట్వీట్ చేసింది.
జాక్ డోర్సీ సారధ్యంలోని ఈ బ్లాక్ తన ఖాతాదారుల సంఖ్య ఎక్కువ చేసి, ఖర్చులు తక్కువ చూపి ఇన్వెస్టర్లను మోసగించిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించింది. రెండేండ్లుగా తాము చేసిన పరిశోధనలో `బ్లాక్`లో జరిగిన పలు కీలకాంశాలు గుర్తించామని తన నివేదికలో వెల్లడించింది.
నిబంధనలు అతిక్రమించి, రుణాల పేరిట దోపిడీకి పాల్పడటం, రివల్యూషనరీ టెక్నాలజీ పేరిట కంపెనీ గణాంకాలు పెంచి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడమే బ్లాక్ వ్యాపార లక్ష్యమని తెలిపింది. బ్లాక్ సంస్థ ఖాతాల్లో 40-75 శాతం వరకు ఫేక్ అని ఆ సంస్థ ఉద్యోగులే తమకు చెప్పారని వివరించింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడి కాగానే ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్ విలువ 18 శాతం పతనమైంది.