ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఐటీ కంపెనీలను భారీగా ప్రభావితం చేస్తోంది.ఈ నేపథ్యంలో టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.కంపెనీ కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు.
తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. సగానికి పైగా తొలగింపులు నాన్ బిల్ కార్పొరేట్ ఫంక్షన్ల సిబ్బందిని ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. మరోవైపు యాక్సెంచర్ తమ వార్షిక రాబడి వృద్ధిని కూడా కుదించుకుంది. గతంలో అంచనా వేసిన 8-11 శాతంతో పోలిస్తే 8-10శాతం మధ్య ఉంటుందని భావిస్తోంది. రాబోయే 18 నెలల్లో లేఆఫ్స్ ప్రక్రియను ముందుకు తీసుకువెళతామని, ఫలితంగా కంపెనీలో 2.5 శాతం ఉద్యోగులు అంటే దాదాపు 19,000 మంది ఉద్యోగులు కొలువులు కోల్పోతారని కంపెనీ తెలిపింది.
ఉద్యోగులకు షాకిచ్చిన మరో కంపెనీ, 300 మందిని ఇంటికి సాగనంపిన స్విస్ టెక్నాలజీ సంస్థ లాజిటెక్
అయితే లేఆఫ్స్‌తో నిమిత్తం లేకుండా ఈ ఏడాది చివరిలో నూతన నియామకాలు కూడా చేపడతామని యాక్సెంచర్ ప్రకటించడం కొంత ఊరట ఇస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్ చేపడుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. అయితే అతిగా రిక్రూట్ చేసుకోవడం వల్లే లేఆఫ్స్ తప్పలేదని చెబుతున్నారు. ఇక ఇప్పటికే గూగుల్, అమెజాన్, విప్రో, మెటా సహా పలు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి.