Sudan Unrest: సూడాన్‌లో ఆర్మీ - పారా మిలటరీ బలగాల మధ్య యుద్ధం, భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎంబసీ
ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
సూడాన్‌లో మరోసారి పరిస్థితి అదుపుతప్పింది. ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. వారు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
పలు ప్రాంతాల్లో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లకండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. తదుపరి అప్‌డేట్స్ కోసం ఎదురుచూడండి అని తెలిపింది. కాగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాడులు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
జపాన్ ప్రధానిపై బాంబు దాడి, ఫుమియో కిషిదా కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం.. విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో, సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. మరోవైపు.. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో పౌరులు భయాందోళనలకు గురై వీధుల నుంచి పరుగులు పెట్టారు.