Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై మూడు దేశాలు ముప్పేట దాడి, హమాస్‌కు తోడైన లెబనాన్ సిరియా దేశాలు, హమాస్ మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యం
పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.
Jerusalem, Oct 11: ఇజ్రాయెల్ మూడు దేశాల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. హమాస్ దాడి మొదలుపెట్టిన రెండో రోజే లెబనాన్ భూభాగం నుంచి కూడా దాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుగా ఉన్న హిజ్బుల్లా బుధవారం మరోసారి లెబనాన్ వైపు నుంచి క్షిపణులు ప్రయోగించింది.
తాజాగా ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామమైన దుహారాలో గైడెడ్ క్షిపణులతో దాడి చేసింది.ఇజ్రాయెల్ పోస్టులపై లెబనాన్ చెందిన ఈ గ్రూపు యాంటీ ట్యాంక్ క్షిపణిని పేల్చేసింది. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో తమ వారిని కోల్పోవడంతో ప్రతిస్పందనగా క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది. తమ దేశ ప్రజలు,సెక్యూరిటీని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే తగిన విధంగా బదులిస్తామని హిజ్బుల్లా హెచ్చరించింది.
దీంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని రక్షణ రంగ నిపుణులు భయపడుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య 2006లో తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. హెజ్బొల్లా- ఇజ్రాయెల్ సేనలు తీవ్ర స్థాయిలో తలబడ్డాయి. తాజాగా తమ ఆయుధ నిల్వలు ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేయలేరని హెజ్బొల్లా హెచ్చరించింది.
మరోవైపు సిరియా నుంచి కూడా ఇజ్రాయెల్‌పై దాడులు మొదలయ్యాయి. తాజాగా శతఘ్ని దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. ఇప్పటికే సిరియా వైపు నుంచి జరుగుతున్న దాడులకు ఇజ్రాయెల్ సైన్యం కూడా దీటుగానే సమాధానం చెబుతోంది. ముఖ్యంగా సిరియా నుంచి మోర్టార్లు, శతఘ్ని గుండ్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. 1967లో ఇజ్రాయెల్ గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకొన్న నాటి నుంచి ఈ రెండు దేశాలతో వివాదం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరోసారి మూడు దేశాల సరిహద్దుల్లో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది.