Israel-Palestine War: 1500 మంది హమాస్ మిలిటెంట్లు హతం, మీరు ప్రారంభించిన యుద్ధాన్ని మేము ముగిస్తామంటూ హమాస్‌కు గట్టిహెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్
దీంతో భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుపక్షాలకు చెందిన సుమారు 1600 మంది మరణించారు.
Tel Aviv, October 10: తమ దేశంపై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం (Israel Army) ఏకి పారేస్తోంది. దీంతో భారీగా ప్రాణనష్టం జరుగుతున్నది. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుపక్షాలకు చెందిన సుమారు 1600 మంది మరణించారు. బందీలుగా పట్టకున్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు (Hamas Militants) హతమార్చుతున్నది.
తమ భూభాగంలో సుమారు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం (Israel’s military) ప్రకటించింది. అయితే దీనిపై పాలస్తీనియన్ అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. హమాస్ స్థావరంగా ఉన్న గాజా సిటీపై (Gaza city) తాము పట్టు సాధించామని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ (Richard Hecht) తెలిపారు.గత రాత్రి నుంచి హమాస్ ఉగ్రవాదులు ఒక్కరుకూడా సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్పారు. అయితే అక్రమ చొరబాట్లు ఇప్పటికీ సాధ్యమేనని వెల్లడించారు.
‘‘గాజా స్ట్రిప్ (Gaza Strip) చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించాం. దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను తిరిగి మా అధీనంలోకి తీసుకున్నాం. సరిహద్దుల వెంబడి కూడా పరిస్థితి పూర్తిగా మా నియంత్రణలోకి వచ్చింది’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ మీడియాకు వెల్లడించారు. అంతేగాక, గత రాత్రి నుంచి ఒక్క హమాస్ ఉగ్రవాది కూడా సరిహద్దులు దాటలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ చొరబాట్లు జరిగే అవకాశముందని తెలిపారు.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికిపైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి.
మరోవైపు హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) ఘాటు హెచ్చరికలు చేశారు. హమాస్ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తమపై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే ముగిస్తామంటూ హమాస్‌కు గట్టిహెచ్చరికలు చేశారు.
ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన అత్యంత పాశవిక మారణహోమంలో మృతుల సంఖ్య 900కు చేరుకుంది. అటు గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కు పెరిగినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. మరోవైపు, సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య నాలుగో రోజు పోరు కొనసాగుతోంది.
హమాస్ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా (USA) ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు కీలకమైన మందుగుండు, మిలిటరీ పరికరాల డెలివరీని ప్రారంభించింది. ఇప్పటికే, విమాన వాహకనౌక, యుద్ధ నౌకలను అమెరికా ఇజ్రాయెల్ తీరానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో నేరుగా కాలుపెట్టే (అమెరికా సైన్యాన్ని పంపడంపై స్పందిస్తూ) ఉద్దేశం తమకు లేదని అమెరికా జాతీయ భధ్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel)కు భారత్ (India) మద్దతు ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఈ మేరకు పీఎం మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారు. అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, అదే ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు.