Liz Truss Resigns As UK PM: ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే.. బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా, లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరో మారు రాజకీయ సంక్షోభం
ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే ఆమె బాధ్యతల నుంచి వైదొలిగారు. బ్రిటన్‌లో చరిత్రలోనే అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేత ట్రసే కావడం గమనార్హం. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని (Liz Truss Resigns As UK Prime Minister) వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే ఆమె బాధ్యతల నుంచి వైదొలిగారు. బ్రిటన్‌లో చరిత్రలోనే అతి తక్కువ కాలం ప్రధానిగా ఉన్న నేత ట్రసే కావడం గమనార్హం. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని (Liz Truss Resigns As UK Prime Minister) వెల్లడించారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ తాను ప్రధాని పదవిలో కొనసాగుతానని తెలిపారు. లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరో మారు రాజకీయ సంక్షోభం (Political Crisis) ఏర్పడింది.
కాగా బ్రిటన్‌లో కొద్ది రోజుల క్రితమే ఎన్నికలు జరిగాయి. భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ పోటీ పడ్డారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులంతా ట్రస్‌కే పట్టంగట్టడంతో ఆమె సునాయసంగా విజయం సాధించారు. సెప్టెంబర్ 5న ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బ్రిటన్‌లో ట్రస్ వచ్చాక పరిస్థితి మారుతుందని అంతా భావించారు.కానీ ట్రస్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది.
తొలిసారి ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్‌లో పేదలకు, సంపన్నులకు సమానంగా ఇంధన రాయితీలు ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చింది. దీంతో మూడు రోజులుగా మౌనంగా ఉన్న ట్రస్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘‘తప్పులు చేశాం.. మన్నించండి’’ అని క్షమాపణలు చెప్పారు.తాను ఎక్కడికి వెళ్లిపోనని, వచ్చే సాధారణ ఎన్నికలకు కన్జర్వేటివ్ పార్టీకి నేతృత్వం వహిస్తానని ప్రకటించారు.
బీబీసీతో ఆమె మాట్లాడుతూ.. ‘‘మేం తప్పులు చేశామని గుర్తించాను. వాటిని సరిదిద్దుకున్నాను. కొత్త చాన్స్‌లర్‌ను నియమించాను. ఆర్థిక స్థిరత్వాన్ని, క్రమశిక్షణను తిరిగి పెంపొందించాను. ప్రజా సంక్షేమం కోసం మెరుగైన విధానాల్లో ముందుకు వెళ్తాం.’’ అని ట్రస్ చెప్పారు. అంతర్జాతీయంగా బ్రిటన్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం చూపిందని తెలిపారు. ‘‘ప్రజలకు ఏదో మేలు చేయాలని అనుకున్నాం. అధిక పన్నుల విషయంలో వారికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నాం. కానీ, మేం ఎక్కడో పొరపాటు చేశాం.’’ అని వ్యాఖ్యానించారు. కాగా, మినీ బడ్జెట్‌లో ప్రకటించిన పన్నుల తగ్గింపును పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు నూతన ఆర్థిక మంత్రి జెర్మీ హంట్ ప్రకటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశ దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితిపై హంట్‌కు అవగాహన ఉందని అన్నారు.
అయితే ట్రస్‌ను కూడా తప్పించేందుకు కన్జర్వేటివ్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. ఆమెపై సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ట్రస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆమె ప్రధాని పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కొత్త ప్రధానిగా ఎవర్ని ఎన్నుకుంటారో చూడాలి. నాలుగేళ్ల కాలంలో బ్రిటన్‌కు నాలుగో ప్రధాని ఎన్నిక రావడం గమనార్హం.
ఇక ఇప్పుడు ఎన్నికలు జరిగితే..బ్రిటన్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాజీ మంత్రి రుషి సునాక్ విజయం తథ్యమని పోల్ సర్వే ఒకటి పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం ఎన్నికలకు వెళితే ప్రధాని ట్రస్ పరాజయం ఖాయమని తెలిపింది.