Wuhan Lock down: చైనాలో మరోసారి లాక్‌డౌన్, వుహాన్‌లో మరోసారి కరోనా కేసులు నమోదు, 10లక్షల మందిని లాక్‌డౌన్‌లో పెట్టిన చైనా ప్రభుత్వం, జీరో కోవిడ్ వ్యూహం అంటూ ప్రజలకు కష్టాలు
దాంతో ప్రభుత్వం మరింత అలర్టయింది. ఏకంగా 10లక్షల మందిని లాక్ డౌన్‌లో (Lock down) ఉంచింది. జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు.
Beijing, July 29: కరోనా పుట్టినిల్లు చైనాలో (China) కరోనా (Corona) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాంతో మరోసారి లాక్‌డౌన్ విధించింది స్థానిక ప్రభుత్వం. జీరో కోవిడ్ (Zero COVID) విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న చైనా...కరోనా కేసులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తోంది. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తోంది. అయితే ప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైన వుహాన్ లో (Wuhan) కొత్తగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దాంతో ప్రభుత్వం మరింత అలర్టయింది. ఏకంగా 10లక్షల మందిని లాక్ డౌన్‌లో (Lock down) ఉంచింది. జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. దీంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. గతంలో కూడా పలుప్రాంతాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అలర్టయింది. ప్రజలను ఐసోలేషన్ పేరుతో ఇబ్బందులకు గురి చేసింది. వారిని ఇళ్లకే పరిమితం చేసింది.
ఈ మధ్యనే కొన్ని దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించింది చైనా. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో వుహాన్ లో మరోసారి కరోనా కేసులు రావడంతో మరోసారి లాక్‌డౌన్ ప్రారంభమైంది. ఇది ఎప్పటివరకు కొనసాగుతుందో చెప్పలేమంటున్నారు అధికారులు.
గడిచిన రెండేళ్లుగా వరుస లాక్ డౌన్‌లతో చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిస్థితులు సద్దుమణుగుతున్నాయన్న సమయంలో లాక్‌డౌన్ ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. చైనా అమలు చేస్తున్న కోవిడ్ ఆంక్షల విధానాలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.