Pakistan Political Crisis: పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు ఊరట, ఏప్రిల్ 3 వరకూ పార్లమెంట్ వాయిదా, ఈ లోపే ప్రతిపక్షాలకు సంచలన ఆఫర్ ఇచ్చిన పాక్ ప్రధాని
ఏప్రిల్ 3 వరకూ పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
Islamabad, March 31: పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు ఊరట లభించింది. ఏప్రిల్ 3 వరకూ పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని ఇమ్రాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంట్‌ను వాయిదా వేయడం ఆసక్తికర పరిణామం.
అయితే ఈ 3 రోజులు పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు (Pakistan PM Imran Khan) చాలా కీలకమైన రోజులని, ఆయన కుర్చీని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. అవిశ్వాసంపై ఏప్రిల్ 3న చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే అవిశ్వాస తీర్మానంపై చర్చకు కొద్ది గంటల ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే.. తాను పార్లమెంట్‌ను రద్దు చేస్తానని ప్రతిపక్షాలకు ఆఫర్ ఇచ్చారు.
ఈ విషయాన్ని ప్రధాని ఇమ్రాన్ కోటరీలోని ఓ కీలక వ్యక్తి ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్‌కు చేరవేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతలు ఓ చోట సమావేశమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పాక్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని, దీనికి విరుగుడు ఇదేనని ఇమ్రాన్ సందేశం పంపారు. ఒకవేళ తాను పంపిన ప్రతిపాదనకు ప్రతిపక్షాలకు అంగీకరించని పక్షంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను రెడీగా ఉన్నానని (PM Imran Khan Refuses to Resign) ఇమ్రాన్ తేల్చి చెప్పారు.
తాను ఎవరి దగ్గరా తలవంచే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్ సమాజాన్ని కూడా ఎక్కడా తలవంచనీయని హామీ ఇచ్చారు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కొన్ని విదేశీ శక్తులు కుట్రలు (3 Stooges Working With Foreign Powers) పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్‌కు ఓ స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలన్నదే తన అభిమతమని, భారత్‌తో సహా, ఏ దేశంతోనూ విరోధం పెట్టుకోనని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ హిందూ వ్యతిరేక దేశం కాకూడదన్నదే తన అభిమతమన్నారు. అమెరికాను గట్టిగా సమర్థించి, పర్వేజ్ ముషార్రఫ్ పెద్ద తప్పిదమే చేశారని ఇమ్రాన్ విమర్శించారు. అమెరికాతో పాటు, ఇండియాలో కూడా తనకు మంచి స్నేహితులు ఉన్నారని, వారితో వ్యక్తిగత విరోధం లేదని, కేవలం విధానపరమైన భేదాలే ఉన్నాయని ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని పదవికి రాజీనామా చేయమని కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని పరోక్షంగా ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ మండిపడ్డారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలి? అంటూ సూటిగా ప్రశ్నించారు. 20 సంవత్సరాల పాటు క్రికెట్ జీవితంలో ఉన్నానని, తాను చివరి బంతి వరకూ ఆడుతూనే వుంటానని చాలా మందికి తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తానెప్పుడూ ఓటమిని అంగీకరించలేదని అన్నారు. అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రజలు అన్నీ చూస్తారని, ఎవరు తమ తమ అంతర్మాతలను అమ్మేసుకున్నారని కూడా తెలుస్తుందన్నారు. ఎక్కడైనా ప్రజా ప్రతినిధులు డబ్బులకు అమ్ముడు పోతారా? ఇదేనా పాక్ యువతకు ఇస్తున్న సందేశం? అంటూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అలాంటి వారిని ప్రజలు ఏమాత్రం క్షమించరని ఇమ్రాన్ హెచ్చరించారు.
తాను రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు గడిచాయని, న్యాయం, మానత్వం, ఆత్మాభిమానం.. ఈ మూడు అంశాలనే మేనిఫెస్టోగా ముందు పెట్టుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు ఇమ్రాన్ వివరించారు. తన చిన్నతనంలో పాకిస్తాన్ బాగా ఎదిగిన దేశంగా ఉండేదని, సౌత్ కొరియా లాంటి దేశాలు పాక్ వద్ద పాఠాలు నేర్చుకునేవని అన్నారు. మలేశియా రాణులు కూడా తనతో కలిసి చదువుకున్నారని, మధ్య ఆసియా వారు పాక్ యూనివర్శిటీలకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఇంత ఘనమైన చరిత్రను చూశానని, అలాగే అధః పాతాళంలోకి వచ్చిన పాక్‌ను కూడా చూశానని అన్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగడుతున్నాయి. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ దిగిపోతే ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.