PM Modi in Greece: అమరులైన గ్రీస్ సైనికులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా గ్రీస్‌లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది
Athens, August 25: ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు గ్రీస్ చేరుకున్నారు.40 ఏళ్లలో ఒక భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది.ఆ దేశ రాజధాని ఏథెన్స్‌లో దిగిన ఆయనకు ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రైటిస్ స్వాగతం పలికారు.గ్రీస్‌లోని ఏథెన్స్‌లోని ది టోంబ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్ వద్ద సైనికుల సమాధికి నివాళులర్పించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన పర్యటన ప్రారంభించారు.
అనంతరం ప్రధానికి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ది టోంబ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్ అనేది ఓల్డ్ రాయల్ ప్యాలెస్ ముందు ఏథెన్స్‌లోని సింటాగ్మా స్క్వేర్‌లో ఉన్న ఒక యుద్ధ స్మారక చిహ్నం. ఇది వివిధ యుద్ధాలలో అమరులైన గ్రీకు సైనికులకు అంకితం చేయబడిన సమాధి.గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలౌతో సమావేశమై ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో చర్చలు జరుపుతారు. తన రోజంతా పర్యటన సందర్భంగా ఆయన రెండు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు గ్రీస్‌లోని భారతీయులతో కూడా సంభాషించనున్నారు.
Here's ANI Video
బ్రిక్స్ సదస్సు అనంతరం దక్షిణాఫ్రికా నుంచి మోదీ గ్రీస్ చేరుకున్నారు. ఆ దేశ రాజధాని ఏథెన్స్‌లో దిగిన ఆయనకు ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రైటిస్ స్వాగతం పలికారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయుల్ని కలుసుకున్నారు. ఆయన వారితో కొద్దిసేపు ముచ్చటించారు. చిన్నారులను పలకరించారు. వారు ఆయనకు గ్రీక్ హెడ్‌డ్రెస్(హెడ్ బ్యాండ్)ను బహూకరించారు. మోదీ(Modi) బెస్ట్ పీఎం అని.. ఆయన అందరి మాటలు వింటారని ప్రవాస భారతీయులు వ్యాఖ్యానించారు.