Russia-Ukraine Tensions: వెనక్కి తగ్గిన రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బలగాలు ఉపసంహరణ, డ్రిల్స్ పూర్తి చేసుకున్న తర్వాత దళాలు సరిహద్దు నుంచి వెనక్కి మళ్లాయని తెలిపిన రష్యా రక్షణ మంత్రి
ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధులు వెల్లడించారు. కొన్ని దళాలను మాత్రం తమ బేస్ క్యాంపులకు పంపిస్తున్నట్లు రష్యా చెప్పింది. దక్షిణ, ఉత్తర సైనిక ప్రాంతాల వద్ద ఉన్న బలగాలను వెనక్కి పంపినట్లు రష్యా అధికారులు వెల్లడించారు
Moscow, February 15: యూఎస్‌ఎస్‌ఆర్ మాజీ భాగస్వామి ఉక్రెయిన్‌ను మళ్లీ తనలో కలిపేసుకొనేందుకు రష్యా దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో ప్రపంచమంతా యుద్ధ భయం (Russia-Ukraine Tensions) ఆవరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా పశ్చిమ దేశాల దౌత్యం పనిచేసినట్లు అనిపిస్తోంది.
ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను రష్యా (Some Russian Forces Return to Bases) ఉపసంహరించింది. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధులు వెల్లడించారు. కొన్ని దళాలను మాత్రం తమ బేస్ క్యాంపులకు పంపిస్తున్నట్లు రష్యా చెప్పింది. దక్షిణ, ఉత్తర సైనిక ప్రాంతాల వద్ద ఉన్న బలగాలను వెనక్కి పంపినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. డ్రిల్స్ పూర్తి చేసుకున్న తర్వాత తమ దళాలు కొన్ని సరిహద్దు నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ మంత్రి (Defence Ministry) చెప్పారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సైనిక శిక్షణ తీవ్ర స్థాయిలో (Drills Including in Belarus and Off Ukraine's Black Sea Coast) జరుగుతోంది. ఉద్రిక్తతలను తగ్గించడంలో పశ్చిమ దేశాలు సఫలమైనట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. నాటో దళంలో చేరబోమని ఉక్రెయిన్ హామీ ఇస్తే.. ఆ దేశంపై దాడికి వెళ్లమని రష్యా ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
రష్యా నుంచి దాడి జరిగితే ఎదుర్కొనేందుకు సరిహద్దులోని ప్రజలకు ఉక్రెయిన్ శిక్షణ ఇస్తున్నది. అయితే ఉక్రెయిన్, మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని, అలాగే తూర్పు ఐరోపా నుంచి నాటో కూటమి బలగాలు వెనక్కి వెళ్లాలని సూచిస్తున్నది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణ నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా క్రీవ్‌లోని రాయబార కార్యాలయాన్నిమూసివేసింది. పోలండ్ సరిహద్దులోని ఎల్‌వివ్‌కు సిబ్బందిని తరలించింది. అలాగే కీవ్ నుంచి వెనక్కి రావాలని బ్రిటన్‌తో పాటు మరో ఐదు ఐరోప దేశాలు సైతం కీవ్ నుంచి వెనక్కి రావాలని తమ పౌరులను హెచ్చరించాయి.
ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సూచించింది. ఎవరికైనా ప్రత్యే క పరిస్థితులుంటే మినహా.. మిగతా వారు మాత్రం స్వదేశానికి రావాలని, తమకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది.
భారత ప్రభుత్వం సూచించిన ఈ ఆదేశాల నేపథ్యంలో ఉక్రెయిన్ స్పందించింది. భారత్‌లో ఉండే ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న మాట మాత్రం వాస్తవమే. అయితే పరిస్థితులు మాత్రం అంత విషమించి పోలేదు. చేయి దాటలేదు. అంత తొందరగా, హడావుడిగా భారతీయులను, విద్యార్థులను స్వదేశానికి రావాలని సూచించాల్సిన అవసరం లేదు. రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వాతావరణాన్ని మరీ పెద్దగా చేసి చూపకండి అని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా పేర్కొన్నారు.
రష్యా విదేశాంగ ప్రతినిధి మారి జకరోవా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. 2022, ఫిబ్రవరి 15వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, పశ్చిమ దేశాల యుద్ధ దుష్ప్రచారం విఫలమైనట్లు ఆమె తన ఇన్‌స్టాలో రాశారు. పశ్చిమ దేశాలు అవమానానికి గురయ్యాయని, ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా వాళ్లు ఎత్తులు ధ్వంసం అయినట్లు ఆమె ఆరోపించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుందన్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా నిన్న షేర్ మార్కెట్లు డీలా పడ్డ విషయం తెలిసిందే. అయితే బెలారస్‌లో రష్యా దళాలు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది.
ఈ సైనిక విన్యాసాల వల్లే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వ్యాపించాయి. రష్యా మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. యూనియన్ రిజాల్వ్ పేరుతో బెలారస్‌లో రష్యా సైనిక శిక్షణ చేపట్టింది. తమపై రష్యా యుద్ధానికి వెళ్తుందని అమెరికా తప్పుదోవ పట్టించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. పశ్చిమ దేశాల మీడియా వైఖరిని ఉక్రెయిన్ ఖండించింది. పూర్తి స్థాయిలో రష్యా తమపై యుద్ధానికి రాబోదని ఉక్రెయిన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే రష్యా బధవారం ఉక్రెయిన్‌పై దాడి దిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి వెళ్లిన ప్రభుత్వ అధికారులంతా 24 గంటల్లో తిరిగి రావాలని కోరారు. మరో వైపు ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా అదనపు బలగాలను మోహరిస్తుండగా.. సరిహద్దుల్లో వేర్పాటువాదుల దాడులు పెరిగాయని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇది మరింతగా ఆజ్యం పోసింది.