Russia-Ukraine War: రష్యా దండయాత్రను ఆపండి, ప్రపంచ దేశాలు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, 29వ రోజుకు చేరుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
రష్యా తన దండయాత్రను ఆపడానికి అంతర్జాతీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పౌరులను వారి దేశాల్లో నిరసనలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
Kyiv, March 24: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు (Russia-Ukraine War) నడుస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన పిలుపునిచ్చారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelenskyy) ప్రపంచ ప్రజలను కోరారు.రష్యా తన దండయాత్రను ఆపడానికి అంతర్జాతీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పౌరులను వారి దేశాల్లో నిరసనలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
మార్చి 24వతేదీ నుంచి ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి తమ దేశ చిహ్నాలతో వీధుల్లోకి రండి, మీ వాణిని వినిపించండని జెలెన్స్కీ వీడియోలో కోరారు.మనమందరం రష్యాను ఆపాలి. ప్రపంచం యుద్ధాన్ని ఆపాలి. ఉక్రెయిన్‌కు మద్దతుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతియుతంగా ఉండేవారిపై ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.‘‘ యుద్ధం మొదలై ఇప్పటికే నెల రోజులైంది.ఇది నా హృదయాన్ని, ఉక్రేనియన్లందరి హృదయాలను విచ్ఛిన్నం చేస్తోంది. అందుకే యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడమని ( Global Protests as Russian Invasion Completes One Month) నేను మిమ్మల్ని అడుగుతున్నానని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 29వ రోజుకు చేరుకోగా రెండు దేశాలు మరో రౌండ్ చర్చలకు సిద్ధమవుతున్నాయి.
నిన్న దేశ రాజధాని కీవ్‌లో రష్యన్ బలగాలు గుండ్ల వర్షం కురింపించడంతో రష్యాకు చెందిన మహిళా జర్నలిస్టు మృతిచెందింది. పరిశోధనాత్మక వార్తా సంస్థ ది ఇన్‌సైడర్‌కు (The Insider) చెందిన జర్నలిస్టు ఓక్సానా బౌలినా (Oksana Baulina) మరణించిందని ఆ సంస్థ ప్రకటించింది. కీవ్‌లో రష్యా దళాలు సృష్టించిన విధ్వంసాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు మృతిచెందిందని తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. ఈ దాడిలో మరో పౌరుడు కూడా మరణించాడని, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పింది. బౌలినా గతంలో రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ అవినీతి నిరోధక బృందంలో పనిచేశారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బౌలినా క్షేత్రస్థాయిలో ఇన్‌సైడర్ కోసం పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కీవ్, ఎల్వివ్ నుంచి అనేక వార్తా కథనాలను ఆమె అందించారు.
క్రెయిన్‌కు ఆయుధాలతోపాటు ఆర్థికంగా మరింత సాయం అందిస్తామని బ్రిటన్ ప్రకటించింది. ఉక్రెయిన్ ఆర్మీకి 6 వేల మిస్సైళ్లు, 25 మిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) చెప్పారు. ఇందులో మిలిటరీ హార్డ్‌వేర్, యాంటీ ట్యాంక్, అత్యధిక పేలుడు సామర్థ్యం కలిగిన ఆయుధాలు ఉంటాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించడానికి నాటో, జీ7 దేశాలు సమావేశమవుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఈ మేరకు ప్రకటించారు. కాగా, బ్రిటన్ ఇప్పటికే 4 వేల యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, జావెలిన్ క్షిపనులను ఉక్రెయిన్ సైన్యానికి అందించింది. అదేవిధంగా మానవాద దృక్పదంతో 400 మిలియన్ ఫౌండ్ల ఆర్థిక సహాయం అందిస్తామని గతంలో ప్రకటించింది.