Texas School Shooting: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా, బామ్మను చంపి స్కూలులోకి చొరబడిన దుండగుడు, కాల్పుల ఘటనలో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి
టెక్సాస్‌లో ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి ( 18 Students Among 21 Shot Dead) చెందారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Houston, May 25: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లో ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి ( 18 Students Among 21 Shot Dead) చెందారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. మృతిచెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబాట్ తెలిపారు. అనుమానితుడు ఉవాల్డే హైస్కూల్‌లో (Robb Elementary School) 18 ఏళ్ల విద్యార్థి అని అబాట్ చెప్పారు. పద్దెనిమిదేళ్ల నిందితుడిని అక్కడిక్కడే కాల్చి చంపేశాయి భద్రతా దళాలు.
ఇదిలా ఉంటే చాలాకాలం తర్వాత అమెరికా గన్ కల్చర్‌లో ఇంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని సాల్వడోర్ రామోస్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు ముందు.. తన బామ్మను చంపిన తర్వాతే వాహనంలో స్కూల్‌కు చేరుకుని ఘాతుకానికి పాల్పడినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్‌లో 18 మంది చిన్నారులను దుండగుడు కాల్చిచంపిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
దేశంలోని శక్తివంతమైన తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో మనం ఎప్పుడు గన్ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం అంటూ వైట్‌హౌజ్ నుంచి ఆయన ప్రసంగించారు. ఈ బాధను ప్రతి తల్లిదండ్రులకు, ఈ దేశంలోని ప్రతి పౌరునికి చర్యగా మార్చాల్సిన సమయం.. ఇదే. ఈ దేశంలో ఎన్నికైన ప్రతి అధికారికి(సెనేటర్‌లను ఉద్దేశిస్తూ..) మనం స్పష్టంగా తెలియజేయాలి. ఇది పని చేయాల్సిన తరుణం అంటూ ఆయన పేర్కొన్నారు. ఘటనకు సంతాపసూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం పాటించాలని జో బైడెన్ కోరారు.
ఈ సందర్భంగా చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను ఆయన గుర్తు చేసుకున్నారు. 1972లో ఓ కారు ప్రమాదంలో బైడెన్ భార్య, కూతురు చనిపోయారు. 2015లో ఆయన కొడుకు కేన్సర్‌తో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరం కావడం అంటే.. అది వాళ్ల గుండెకు మాయని గాయం.. కొంతకాలం దాకా కోలుకోలేని క్షోభ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. గన్ కల్చర్ కట్టడికి ‘ఘోస్ట్ గన్స్’ చట్టం చేసింది బైడెన్ ప్రభుత్వం. అయితే దీనికి రాజకీయపరంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇల్లీగల్ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు సెనేటర్ల వల్లే ఈ చట్టం సమర్థవంతంగా అమలు కాలేకపోతోందని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది.
Texas School Shooting ఘటనపై అమెరికా వైస్‌ప్రెసిడెంట్ కమలాహ్యారీస్ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇక చాలని.. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె వ్యాఖ్యానించారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయాలి అని వ్యాఖ్యానించారామె. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాల అధినేతలు సైతం ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు ‘ఘోస్ట్ గన్’ కారణమని పోలీసులు గుర్తించారు.
అక్రమ తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’గా పరిగణించొచ్చు. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఘోస్ట్ గన్‌లకు లైసెన్స్ ఉండదు. అలాగే వాటికి సీరియల్ నెంబర్ ఉండవు. త్రీడీ ప్రింట్ ద్వారా కూడా వీటిని తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇల్లీగల్ కావడంతో.. వీటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను కూడా అమ్మడానికి వీల్లేదు. కానీ, చట్టాల్లోని లొసుగులతో.. ఆన్‌లైన్‌లో కొందరు వీటి తయారీకి అవసరమయ్యే మెటీరియల్‌ను అమ్మేస్తున్నారు.
2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. కేవలం న్యూయార్క్ నగరంలోనే 2019 లో 47, 2020లో 150, 2021లో 150 ఘోస్ట్ గన్స్ దొరికాయి.