Typhoon Yagi: వియత్నాంను వణికించిన యాగి తుపాను, భారీ వరదలకు 141 మంది మృతి, మరో 59 మంది గల్లంతు, వరద పోటెత్తి పొంగిపొర్లిన డైక్ నది

అక్కడ కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141 మంది మృతిచెందారు. మ‌రో 59 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

Powerful Typhoon Hits Vietnam (Photo Credits: X/@TungNgoCNA)

Hanoi, Sep 11: వియత్నాంను యాగి తుపాను వణికిస్తోంది. అక్కడ కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141 మంది మృతిచెందారు. మ‌రో 59 మంది గల్లంతయ్యారని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఇక మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందినవారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు చెందినవారు, 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందినవారు ఉన్న‌ట్లు తెలిపింది.

క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే డైక్ నదికి వరద పోటెత్తి పొంగిపొర్లింద‌ని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు మంగళవారం ధ్రువీకరించిన‌ట్లు వియత్నాం న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ జిన్హువా పేర్కొంది. రాజధాని హనోయిలోని రెడ్ రివర్‌పై వరద స్థాయులు మూడో స్థాయి హెచ్చరికల‌ను దాటాయి. బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ అంచనా వేసింది.

యాగి తుపాను ధాటికి చైనా అతలాకుతలం, భారీగా ఆస్తి - ప్రాణ నష్టం, రెడ్ అలర్ట్ జారీ చేసిన చైనా జాతీయ వాతావరణ కేంద్రం!

బుధవారం ఉదయం థావో నది నీటి మట్టం పెరిగి, దాని స‌మీప‌ ప్రాంతాలలో వరదలు పోటెత్తుతాయ‌ని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియోరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాదిలోని నదులపై వరద నీటి ప్ర‌భావం ఎక్కువగా ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఉత్తర ప్రాంతాలలో లోతట్టు, నదీతీర ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.