IGF UAE 2022: భారత్-యూఏఈ మధ్య బంధం కేవలం మనుగడ కోసమే కాదు.. ప్రపంచ రూపురేఖలను మార్చడానికి కూడా.. గ్లోబల్ ఫోరంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు
భారత్-యూఏఈ మధ్య బంధం కేవలం మనుగడ కోసమే కాదని, తమ బంధం ప్రపంచ రూపురేఖలను మార్చడానికి కూడా సాయపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ఆకాంక్షించారు.
Abu Dhabi, Dec 13: ప్రపంచ వాతావరణ పరిరక్షణలో భాగంగా యూఏఈ (UAE) వేదికగా నిర్వహించిన ఐజీఎఫ్ యూఏఈ (IGF UAE) (గ్లోబల్ ఫోరం)-2022లో పాల్గొన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ (JaiShankar) మాట్లాడారు. ప్రకృతి పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్ (Global Warming) కట్టడికి యూఏఈతో కలిసి పనిచేస్తామని తెలిపారు. భారత్-యూఏఈ మధ్య బంధం కేవలం మనుగడ కోసమే కాదని, తమ బంధం ప్రపంచ రూపురేఖలను మార్చడానికి కూడా సాయపడుతుందని ఆకాంక్షించారు. G20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం, కాప్ 28కి యూఏఈ ఆతిథ్యం, ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం, వాతావరణ మార్పులు-సవాళ్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ క్రమంలో జైశంకర్ తో యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారుడు డాక్టర్ అన్వర్ మహమ్మద్ గర్గాష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు, వాతావరణ పరిరక్షణకి సభ్య దేశాలు చేపట్టాల్సిన చర్యలు, వెచ్చించాల్సిన వ్యయం తదితర అంశాలపై చర్చించారు.
యూఏఈతో మన బంధం ఎంతో దృఢమైంది.. ఐజీఎఫ్ యూఏఈ గ్లోబల్ ఫోరంలో జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో కర్భన ఉద్గారాల తగ్గింపులో తాము కృషి చేసినట్టు, సోలార్ విద్యుత్తుపై పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినట్టు అన్వర్ తెలిపారు. టెక్నాలజీ విషయంలో పోటీ, వాదనలు ఉన్నప్పటికీ, ప్రపంచీకరణ నేపథ్యంలో కలసికట్టుగా అందరం పనిచేసే వీలు కలుగుతున్నదని జైశంకర్ అన్నారు. డేటా సెక్యూరిటీపై ఇరువురూ చర్చించారు. 2022 ఫిబ్రవరి నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 30 శాతం వరకూ పెరిగిందన్న అన్వర్.. వచ్చే రోజుల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అభిలాషించారు.