TVS Apache RTR 160 4V: టీవీఎస్ నుంచి సరికొత్త అపాచీ ఆర్టీఆర్ 160 4వి 2021 మోడెల్ మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో విడుదల, దీనిలో వేరియంట్లు మరియు ధరలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
తద్వారా రేసింగ్ బైక్ కేటగిరీలో ఈ బైక్ నిలుస్తుంది....
New Delhi, March 10: టీవీఎస్ మోటార్ కంపెనీ తన బ్రాండ్ నుంచి సరికొత్త టీవీఎస్ అపాచీ 2021 ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌ను బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభించనుంది, వేరియంట్ ను బట్టి దీని ధర ఉండనుంది. ఢిల్లీ ఎక్స్-షోరూంలో డిస్క్ వేరియంట్ ధర రూ. 1,10,320 ఉండగా డ్రమ్ వేరియంట్ ధర రూ. 1,07,270గా పేర్కొన్నారు. ఈ కొత్త బైక్ ఆకర్శణీయమైన రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్ మరియు మెటాలిక్ బ్లూ అనే మూడు రంగులలో లభిస్తుంది.
వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ అపాచీ 2021 ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్ ఇంజన్ యొక్క టార్క్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా రేసింగ్ బైక్ కేటగిరీలో ఈ బైక్ నిలుస్తుంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి మోటారుసైకిల్‌కు 159.7 సిసి సామర్థ్యం గల అధునాతన ఆయిల్-కూల్డ్ ఇంజిన్, సింగిల్ సిలిండర్, 4-వాల్వ్ అమర్చారు. ఇది 9250 ఆర్‌పిఎమ్ వద్ద 17.63 పిఎస్‌ల శక్తిని మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్‌ఎమ్ టార్క్ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్‌తో ఇంజిన్ జతచేయబడింది. 17.63 పిఎస్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం ద్వారా 150 సిసి సామర్థ్యం గల బైక్స్ కేటగిరీలో ఇది 'మోస్ట్ పవర్ఫుల్' మోటార్ సైకిల్ అని టీవీఎస్ కంపెనీ తమ ప్రకటనలో పేర్కొన్నారు.
మోటారుసైకిల్ కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గల సరికొత్త డ్యూయల్ టోన్ సీటు ఇచ్చారు. ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌తో పాటు ఆకర్శణీయమైన క్లా స్టైల్డ్ పొజిషన్ లాంప్స్ ఇవ్వడం ద్వారా ఈ బైక్ చూడటానికి ప్రీమియం బైక్ అప్పీల్‌ను కలిగిస్తుంది. అదనంగా, మిగతా అపాచీలతో పోలిస్తే ఈ మోటారుసైకిల్ లో రెండు కిలోల బరువు తగ్గించారు. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు కలిగి ఉండగా, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది. మొత్తంగా టీవీఎస్ అపాచీ 2021 ఆర్టీఆర్ 160 4వి చోదకుడికి సౌకర్యవంతమైన మరియు శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.