BYD Seal EV: బివైడి సీల్ ఎలక్ట్రిక్ కారు.. కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణించవచ్చు విశేషాలు ఏమిటి? ఈ కారులో ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!
BYD Seal EV: చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD, తమ బ్రాండ్ నుంచి 'BYD సీల్' ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీల్ కారు డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఎక్స్-షోరూమ్ వద్ద ధరలు రూ. 41.00 లక్షల నుండి రూ. 53.00 లక్షల వరకు ఉన్నాయి.
బేస్ వేరియంట్ అయిన 'BYD సీల్ డైనమిక్' లో 61.44 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 201 bhp శక్తిని, 310 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ మీద ఈ కారుతో 510 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని ధర రూ. 41 లక్షలు.
BYD సీల్ ప్రీమియం వేరియంట్‌లో 82.56 kWh బ్యాటరీ ఉంటుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 308 bhp శక్తిని, 360 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ మీద ఈ కారుతో 650 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని ధర రూ. 45.55 లక్షలు.
టాప్-ఎండ్ BYD సీల్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లో కూడా 82.56 kWh బ్యాటరీ ఉంటుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 523 bhp శక్తిని, 670Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ మీద ఈ కారుతో 580 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అయితే మూడింటిలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఏకైక వేరియంట్ ఇదే కావడం విశేషం. దీని ధర రూ. 53 లక్షలు.
కాగా BYD సీల్ కారు కేవలం 3.8 సెకన్లలో సున్నా నుండి 100 km/h వేగాన్ని అందుకోగలదు. ఒక్క వేగం మాత్రమే కాదు, అద్భుతమైన మైలేజీని కూడా కలిగి ఉంది. సాంప్రదాయిక 7 kW AC ఛార్జర్‌ని ఉపయోగించి BYD సీల్‌ను 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే డైనమిక్ వేరియంట్‌ను 110 kW ఛార్జర్‌కి ప్లగిన్ చేసి 0 నుండి 85 శాతం వరకు వేగంగా ఛార్జ్ అవుతుంది. మిగతా వేరియంట్‌లు 150 kW ఛార్జర్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారును కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ చేస్తే సుమారు 200 కి.మీ వరకు ప్రయాణించవచ్చు అని నివేదికలు పేర్కొన్నాయి.
BYD Seal EV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
సరికొత్త BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు చూడటానికి ఈ బ్రాండ్ లోని Atto 3 SUV కారు లాగానే సొగసైన,4-డోర్ కూపే రూపాన్ని కలిగి ఉంటుంది. అదే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కారును రూపొందించారు. సీల్ EV పొడవు 4,800 mm, వెడల్పు 1,875 mm మరియు ఎత్తు 1,460 mm, వీల్‌బేస్ 2,920 mm ఉంటుంది.
ఫీచర్లను పరిశీలిస్తే.. సీల్ ఈవీలో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీటు, హీటెడ్ వెంటిలేటెడ్ సీట్లు, 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఉంటాయి.
టాప్ వేరియంట్‌లలో హెడ్స్-అప్ డిస్‌ప్లే, టార్క్ వెక్టరింగ్ సిస్టమ్, డోర్ మిర్రర్‌ల కోసం మెమరీ ఫంక్షన్‌లు, డ్రైవర్ సీట్ మెమరీ, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.
బోర్డులోని ADAS ఫంక్షన్లలో లేన్ డిపార్చర్ వార్నింగ్ - ప్రివెన్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ వార్నింగ్ సిస్టమ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఉన్నాయి.
BYD Seal EV బుకింగ్ వివరాలు
గత నెల ఫిబ్రవరి 28న సీల్ కోసం బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. రూ. 1.25 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. మార్చి 31లోపు కారును బుక్ చేసుకున్న వారికి 7 కిలోవాట్ల హోమ్ ఛార్జర్ ఉచిత ఇన్‌స్టాలేషన్, 3 కిలోవాట్ల పోర్టబుల్ ఛార్జర్, బివైడి సీల్ మొబైల్ పవర్ సప్లై యూనిట్, 6 సంవత్సరాల రోడ్ అసిస్టెన్స్ లభిస్తాయని బివైడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ సేల్స్ హెడ్ శ్రీరంగ్ జోషి తెలిపారు. అంతాకాకుండా లక్కీడ్రాలోని విజేతలకు UEFA మ్యాచ్ టిక్కెట్, విమాన ప్రయాణ ఖర్చులను ఉచితంగా అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.