Tesla Car Unit: భారత్ లో త్వరలోనే టెస్లా కార్ యూనిట్, అక్కడే పెట్టేందుకు దాదాపు రెడీ అయిన ఎలాన్ మస్క్, ఇక ప్రకటనే తరువాయి!
కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాలు ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులకు గుజరాత్ తమకు అనువైన రాష్ట్రం అని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
Ahmadabad, DEC 29: గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ (Tesla) త్వరలో భారత్‌లో ప్లాంట్ (Tesla Car Unit) ఏర్పాటు చేయనున్నదని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ ఈవీ కార్ల తయారీ (Tesla Car Unit) యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రంతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో గుజరాత్‌లో (Gujarat) జరిగే ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సులో ‘టెస్లా ప్లాంట్’పై ఓ ప్రకటన వెలువడనున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా గుజరాత్ లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేశాయి.
గుజరాత్‌తోపాటు తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు అవకాశాలను టెస్లా పరిశీలించినట్లు సమాచారం. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈవీ కార్ల తయారీ ఎగుమతులకు అనుకూల వ్యవస్థ ఉన్నా.. టెస్లా యాజమాన్యం మాత్రం గుజరాత్‌లోనే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాలు ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు.
ఎగుమతులు, దిగుమతులకు గుజరాత్ తమకు అనువైన రాష్ట్రం అని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. గుజరాత్ లోని సనంద్, ధొలెరా, బెచరాజీ ప్రాంతాల్లో తన ప్లాంట్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నది. తొలుత విదేశాల నుంచి కార్లను దిగుమతి చేయనున్నది. అటుపై దేశీయంగా కార్ల తయారీ చేపడుతుందని తెలుస్తోంది. టెస్లా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు విషయమై వచ్చేనెలలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సదస్సులో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రిషికేష్ పటేల్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో టెస్లా తన కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.