Hero Lectro e-Cycles: హీరో లెక్ట్రో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లు విడుదల, బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 40 కిమీ ప్రయాణించవచ్చు, ఇగ్నిషన్ కీ కూడా ఉండందోయ్, మరి వీటి ధర ఎంతో తెలుసా?

Hero Lectro H4 and H7+ e-Cycles - Photo: HeroLectro Official

Hero Lectro e-Cycles: హీరో లెక్ట్రో అనే ఫైర్‌ఫాక్స్ బైక్‌ల బ్రాండ్ తాజాగా H4 మరియు H7+ అనే పేర్లతో రెండు ఇ-సైకిల్ మోడళ్లను ఆవిష్కరించింది. తక్కువ దూరాలకు ప్రయాణించటానికి ఈ సైకిళ్లను రూపొందించారు. వీటిని పెడల్ చేయవచ్చు లేదా బ్యాటరీ సహాయంతో తోలవచ్చు. ఈ రెండు ఇ-సైకిల్‌లలో 7.8 Ah బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీని రీఛార్జ్ చేయటానికి 4.5 గంటల సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు లేదా ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఇ-సైకిల్‌తో ప్రయాణానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

సాంప్రదాయ ద్విచక్రవాహనాలతో పోలిస్తే కనీసం సంవత్సరానికి కనీసం 40,000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే ఇవి పర్యావరణ హితమైనవి కూడా. సంవత్సరానికి 800 కిలోల CO2 ఉద్గారాలను తగ్గించగలవు. వీటన్నింటికి మించి సైకిల్ తొక్కడం ద్వారా వ్యక్తిగతంగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Hero Lectro e-Cycles ఫీచర్లు

హీరో లెక్ట్రో విడుదల చేసిన H4 మరియు H7+ రెండు మోడళ్లలో 250W BLDC మోటార్‌ ఉంటుంది. దీని సహాయం ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు గరిష్టంగా 25 kmph వేగంతో ప్రయాణిస్తాయి.

ఫీచర్ల పరంగా, ఇ-సైకిల్స్‌లో ఇగ్నిషన్ కీ, LED డిస్‌ప్లే, కుషన్డ్ సీట్లు, డిస్క్ బ్రేక్‌లు, రిఫ్లెక్టర్‌లతో కూడిన యాంటీ-స్కిడ్ పెడల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సౌకర్యవంతమైన రైడ్ కోసం H7+ మోడల్‌లో ఫ్రంట్ సస్పెన్షన్‌లు, MTB టైర్‌లను అమర్చారు. ఇవి కాకుండా ఈ సైకిళ్లు దుమ్ముకు, నీటి నిరోధకత కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.

Hero Lectro e-Cycles ధర ఎంత?

H4 మరియు H7+ ఇ-సైకిళ్లు దేశవ్యాప్తంగా 500 ఫైర్‌ఫాక్స్ బైక్‌ల స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. H4 మోడల్ సైకిల్ ఆకర్షణీయమైన మిస్టిక్ పర్పుల్ మరియు వైబ్రెంట్ డిస్టెన్స్ రెడ్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. మరోవైపు హీరో లెక్ట్రో H7+ సైకిల్ లావా రెడ్, స్టార్మ్ ఎల్లో గ్రే అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వీటిలో హీరో లెక్ట్రో H4 సైకిల్ ధర రూ. రూ. 32,499/- కాగా, హీరో లెక్ట్రో H7+ సైకిల్ ధరలు రూ. 33,499/- నుంచి ప్రారంభమవుతున్నాయి.