iSmart Bike: 'హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్' బైక్ విడుదల, భారతదేశపు తొలి బిఎస్ 6 మోటారుసైకిల్ ఇదే, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
ఫ్రంట్ సస్పెన్షన్ ను 15 మి.మీ మరియు వీల్‌బేస్ 36 మి.మీ పెంచారు, ఈ హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ ధర..
New Delhi, November 8: టూవీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), 'హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్' (Hero Splendor iSmart) పేరుతో భారతదేశపు మొట్టమొదటి 'బిఎస్ 6 మోటారుసైకిల్' (బైక్‌ల కేటగిరిలో) ను దిల్లీలో విడుదల చేసింది. దేశంలో ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కాబోయే భారత్ స్టేజ్ 6 (BS 6) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మోటారుసైకిల్‌ను రూపొందించారు. దిల్లీ ఎక్స్-షోరూంలో ఈ హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ ధర, రూ. 64,900/- గా నిర్ణయించారు. ఇందులో 110 సిసి సామర్థ్యం గల ఫ్యుఎల్-ఇంజెక్ట్ ఇంజన్ (fuel-injected engine) అందిస్తున్నారు. ఇది 7,500 RPM వద్ద 9 BHP గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తూ, 5,500 RPM వద్ద 9.89 Nm గల మెరుగైన టార్క్ ను కలిగి ఉంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఐడిల్ స్టార్ట్ మరియు స్టాప్ వ్యవస్థను అమర్చారు. సిగ్నల్ దగ్గర లేదా ఒకచోట బైక్ అలాగే ఆగి ఉన్నప్పుడు ఇంధనాన్ని పొదుపు చేయడంలో సహాయ పడుతుంది.
ఇది వరకు ఈ మోడెల్‌లో విడుదలైన బైక్స్ కంటే ఈ మోటారుసైకిల్‌ను మరింత ధృడంగా మరియు స్థిరత్వాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. ఫ్రంట్ సస్పెన్షన్ ను 15 మి.మీ మరియు వీల్‌బేస్ 36 మి.మీ పెంచారు. స్ల్పెండర్ ఐస్మార్ట్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 180 మి.మీతో ఇచ్చారు కాబట్టి ఎలాంటి రోడ్లుపైనైనా మరియు కఠినమైన ప్రదేశాలలో కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభూతి కలిగిస్తుంది.
స్ల్పెండర్ ఐస్మార్ట్, టెక్నో బ్లూ అండ్ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ మరియు ఫోర్స్ సిల్వర్ & హెవీ గ్రే అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. ప్రస్తుతం ఈ బైక్ ను దిల్లీలోనే అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు. ఇక్కడ సేల్స్ మరియు డిమాండ్‌ను బట్టి కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా అమ్మకాలు చేపడతామని హీరో మోటోకార్ప్ సేల్స్ హెడ్ సంజయ్ భన్ తెలిపారు.