Hyundai Kona Electric SUV: సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ నుంచి ఎలక్ట్రిక్ కార్, ఒక్క ఛార్జ్‌తో 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
దీని ధర, ఇతర ఫీచర్లు గురించి తెలుసుకోండి...
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'కోన ఎలక్ట్రిక్ ఎస్ యూవీ' (Hyundai Kona Electric SUV) కారును భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేశారు. ఇది హ్యుందాయ్ కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్. అంతేకాకుండా ఇండియాలో ఇప్పటివరకు ఉన్న బ్యాటరీ కార్లలో ఇదే పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్.
ప్రపంచవ్యాప్తంగా ఈ కార్ 39.2 kWh మరియు 64 kWh బ్యాటరీ సామర్థ్యం గల రెండు వేరియంట్లలో లభిస్తుండగా, ఇండియాలో మాత్రం ప్రస్తుతానికి 39.2 kWh వేరియంట్ ను మాత్రమే అందిస్తున్నారు. ఈ కారులోని బ్యాటరీకి 8 సంవత్సరాలు లేదా ఒక లక్షా అరవై వేల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు.
అలాగే ఈ కార్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కి. మీ దూరం వరకు ప్రయాణించవచ్చునని సంస్థ వెల్లడించింది. సాధారణ ఛార్జర్ తో రాత్రి నుంచి ఉదయం వరకు 6 గంటలు ఛార్జ్ చేసి పెడితే బ్యాటరీ ఫుల్ అవుతుంది, అలాగే ఫాస్ట్ ఛార్జర్ తో కేవలం 57 నిమిషాలలో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ కారుతో సాధారణ ఛార్జర్ ను మాత్రమే అందిస్తున్నారు. అయినప్పటికీ ఈ కార్ ఛార్జింగ్ కోసం మొదటి దశలో ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలలో ఛార్జింగ్ పాయింట్లను కూడా హ్యుందాయ్ కంపెనీ ఏర్పాటు చేయనుంది.
ప్రయాణాన్ని బట్టి ఇకో, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అనే మూడు రీతుల్లో డ్రైవింగ్ ను సెట్ చేసుకునే వీలుంది. ఇక సేఫ్టీ విషయంలో, కంఫర్ట్ విషయంలో మిగతా కార్లలాగే ఫీచర్లు ఉన్నాయి. 5 సీట్ల కెపాసిటీ, వెనక కెమెరా, మొత్తం 6 ఎయిర్ బ్యాగులు, ఎత్తైన ప్రాంతంలో వెనక్కి జారిపోకుండా హిల్ అసిస్ట్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ కార్ విశిష్టతలు..
ఇంజిన్ - పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోన్
పవర్ - 134bhp
టార్క్ 395Nm
ట్రాన్స్ మిషన్ – మాన్యువల్
100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 9.7 సెకన్లలోనే అందుకోగలదు.
స్టీరింగ్ - టిల్ట్ (పైకి,కిందకు సర్దుబాటు చేసుకునే) మరియు టెలిస్కోపిక్
ముందు, వెనుక - డిస్క్ బ్రేకులు
ఎక్స్‌షోరూం ధర - 25.30 లక్షలు