Komaki Flora e-Scooter: నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే క్లాసిక్ లుక్, అదనపు ఫీచర్లతో 'కొమాకి ఫ్లోరా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొత్త వెర్షన్‌ విడుదల, ఈ EV ప్రయాణ పరిధి ఎంత, దీని ధర, ఇతర విశేషాలను తెలుసుకోండి!

Komaki Flora electric scooter : pic- Komaki Electric

Komaki Flora Electric Scooter: దేశీయ EV తయారీదారు కొమాకి ఎలక్ట్రిక్ తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయిన 'కొమాకి ఫ్లోరా' కొత్త వెర్షన్‌ను రీలాంచ్ చేసింది. మరింత క్లాసిక్ డిజైన్, మరిన్ని మెరుగైన ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో విడుదలైంది. ఎక్స్-షోరూమ్ వద్ద కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ. 69,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో యాక్సెసరీస్ ధరలు కూడా కలిసి ఉన్నాయి.

కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ దీని డిజైన్. ఇది రెట్రో డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి అందమైన పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా అందుబాటు ధరలోనే లభిస్తుండటంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. చాలా వేగంగా అమ్ముడయ్యే EVలలో ఇది ఒకటి.

కొమాకి ఫ్లోరా ఇ-స్కూటర్ గార్నెట్ రెడ్, జెట్ బ్లాక్, స్టీల్ గ్రే మరియు శాక్రమెంటో గ్రే అనే నాలుగు ఆహ్లాదకరమైన రంగులలో లభిస్తుంది. అయితే, కొత్త వెర్షన్‌ కొమాకి ఫ్లోరాలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఉన్న ప్రత్యేక అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Komaki Flora Electric Scooter బ్యాటరీ సామర్థ్యం

కొమాకి ఫ్లోరాలో 3000W లిథియం అయాన్ ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీని అమర్చారు. దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 80కిమీ నుంచి 100 km మధ్య ప్రయాణ పరిధిని అందిస్తుంది. ఈ బ్యాటరీని 0 నుంచి100 శాతం నుండి ఛార్జ్ చేయడానికి 4 గంటల 55 నిమిషాలు పడుతుంది, అయితే 0 నుండి 90 శాతం ఛార్జింగ్ 4 గంటల్లో పూర్తి చేస్తుంది.

అంతేకాకుండా, ఇది కాంపాక్ట్ సైజ్ రిమూవేబుల్ బ్యాటరీ. కాబట్టి రైడర్‌కు అవసరమైనప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయడం, మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం సులభంగా ఉంటుంది. అదనంగా హీట్ ప్రూఫ్ కలిగిన బ్యాటరీ తద్వారా అగ్ని నిరోధకతను పెంచడం ద్వారా రైడర్ భద్రతను నిర్ధారిస్తుంది.

Komaki Flora Electric Scooter ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కీలెస్ ఎంట్రీ, కీఫోబ్, బ్లూటూత్ కనెక్టివిటీ, అత్యవసర పరిస్థితుల కోసం SOS బటన్ ఉన్నాయి, రేడియో FM తో వచ్చే సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. అదనంగా LED హెడ్‌ల్యాంప్‌, పాటు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, బహుళ సెన్సార్లు, స్వీయ-నిర్ధారణ, వైర్‌లెస్ అప్‌డేట్‌లు అందించే స్మార్ట్ డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది.

ఇంకా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లాట్ ఫ్లోర్‌తో వస్తుంది కాబట్టి సామాగ్రిని సులభంగా మోసుకెళ్లవచ్చు. అదనంగా సీటు కింద 18 లీటర్ల సామర్థ్యం కలిగిన బూట్ స్పేస్ కూడా ఉంది, దీనిలో తగినంతా సామాగ్రిని నిల్వ చేసుకోవచ్చు. వెనుక పిలియన్ కోసం డ్యూయల్ ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. హెడ్‌రెస్ట్, గ్రాబ్ పట్టాలు కూడా ఉన్నాయి. సీటు కూడా పొడవుగా ఉంది కాబట్టి ఇద్దరు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు.

ఈ స్కూటర్ ఎకో, స్పోర్ట్, టర్బో అనే మూడు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిమీ.