mXmoto M16: ఈవీల సెగ్మెంట్‌లో సరికొత్త మోడల్.. మిగతా ఎలక్ట్రిక్ బైక్‌లకు భిన్నంగా M16 అనే క్రూయిజర్-స్టైల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను రూపొందించిన భారతీయ స్టార్టప్, ఒక్క ఛార్జ్‌తో 220 కిమీ ప్రయాణం, దీని ప్రత్యేకతలు చూడండి!
mXmoto M16: భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో కొత్త రకం మోడల్‌ను పరిచయం చేసింది. EV స్టార్టప్ mXmoto తమ బ్రాండ్ నుంచి సరికొత్త mXmoto M16 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు వచ్చిన బైక్‌లతో పోలిస్తే M16 అనేది క్రూయిజర్-స్టైల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. అంతేకాకుండా ఈ బైక్ అత్యంత మన్నికైన మెటల్ బాడీతో తయారు చేయబడింది, ఇది భారతీయ పరిస్థితులకు అనువైనదిగా కంపెనీ తెలిపింది. కంపెనీ నుండి అత్యంత ఖరీదైన EV కూడా ఇదే కావడం గమనార్హం. mXmoto M16 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కొనుగోలుపై కంపెనీ దీని బ్యాటరీ ప్యాక్ కోసం 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీ సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. mXmoto M16 మోటార్‌సైకిల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను మరింత నిశితంగా పరిశీలిద్దాం.
mXmoto M16 EV డిజైన్- ఫీచర్లు
M16 గురించి చెప్పాలంటే, మోటార్‌సైకిల్ స్టెప్డ్ సింగిల్ పీస్ సీటుతో, పిలియన్ ప్యాసింజర్‌కు బ్యాక్‌రెస్ట్‌తో అందిస్తూ క్రూయిజర్ బైక్ నిష్పత్తులను పాటించింది. క్రూయిజర్ మోటార్‌సైకిళ్ల యొక్క స్ల్పిట్ ఫ్రేమ్ నుండి ప్రేరణ పొందిన ఛాసిస్‌పై నిర్మించబడింది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు సర్దుబాటు చేయగల ట్విన్ షాక్‌లను కలిగి ఉంది.
M16లో పూర్తిగా LED లైటింగ్, ఆటో ఆన్- ఆఫ్ ఫంక్షన్‌తో కూడిన అడాప్టివ్ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ LED DRL, ఇన్‌బిల్ట్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్, పార్క్ ఫంక్షన్ మరియు రీజెనరేషన్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
mXmoto M16 శక్తి- సామర్థ్యాలు
mXmoto M16 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. హబ్-మౌంటెడ్ మోటార్ 140Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 160-220 కిమీల ప్రయాణ పరిధిని అందిస్తుంది. దీని బ్యాటరీని మూడు గంటల్లో 0 నుండి 90 శాతం వరకు రీఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది, అయితే బ్యాటరీ ప్యాక్ పరిమాణం, యాక్సిలరేషన్ మరియు టాప్ స్పీడ్ గురించి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.