Skoda Slavia Style Edition: స్కోడా కారులో మరొక స్టైలిష్ వేరియంట్, స్లావియా స్టైల్ ఎడిషన్ పేరుతో ప్రత్యేక వేరియంట్ కారు విడుదల, ఈ కారులో నవీకరించిన ఫీచర్లు ఏమిటి, ధరెంత.. తెలుసుకోండి!
Skoda Slavia Style Edition: ప్రముఖ కార్ మేకర్ స్కోడా ఆటో ఇండియా, తమ బ్రాండ్ నుంచి విడుదల చేసిన స్కోడా స్లావియా సెడాన్ కారు మార్కెట్లో సక్సెస్ అవడంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ కారు ఇటీవలే లక్ష యూనిట్లకు పైగా విక్రయాలు జరుపొకొని సరికొత్త మైలురాయిని సాధించింది. దీనికి గుర్తుగా కంపెనీ స్కోడా స్లావియా కారులో సరికొత్త స్టైల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.
స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 19.13 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. సాధారణ స్కోడా స్లావియా కారుతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ కారు సుమారు రూ. 30,000 ఖరీదైనది మరియు అందుకు తగినట్లుగా అనేక ఫీచర్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. స్లావియా స్టైల్ వేరియంట్ కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఇది పరిమిత ఎడిషన్ కారు. స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ కారును కేవలం 500 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నారు.
Skoda Slavia Style Edition ప్రత్యేకతలు
స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ కారు డిజైన్ పరంగా వివిధ కాస్మెటిక్ ట్వీక్‌లను పొందింది. ఈ కారు క్యాండీ వైట్, టోర్నాడో రెడ్ మరియు బ్రిలియంట్ సిల్వర్ అనే మూడు ఎక్ట్సీరియర్ కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. కొత్తగా చేర్చిన అప్‌డేట్‌లను పరిశీలిస్తే, స్లావియా స్టైల్ ఎడిషన్‌లో డ్యూయల్ కెమెరా డాష్ కెమెరా, పుడ్ల్ ల్యాంప్స్, కొత్త 'స్లావియా' బ్రాండ్ స్కఫ్ ప్లేట్‌లతో పాటు బి-పిల్లర్ మరియు స్టీరింగ్ వీల్‌పై ‘ఎడిషన్’ బ్యాడ్జింగ్‌ను అమర్చారు.
ఇవి కాకుండా, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేషన్ కలిగి ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ముందు సీట్లు, బ్లాక్ మిర్రర్ కవర్లు మరియు బ్లాక్ రూఫ్ ఫాయిల్‌ను అందిస్తున్నారు.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో స్లావియా ఇప్పటికే పూర్తి ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
Skoda Slavia Style Edition ఇంజన్ సామర్థ్యం
కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రకారంగా, ఈ కారులో 1.5-లీటర్ ఇంజన్ ఉంటుంది, ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 148bhp శక్తిని, 250Nm ప్రాక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది.