Intel Layoffs: 20 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోబోతున్నాం.. ఇందులో భాగంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన
ఈ క్రమంలో అమెరికా చిప్ ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది.
Newdelhi, Aug 2: ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్ (Market) లో తిరోగమనం వెరసి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగ కోతలకు (Layoffs) పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా చిప్ ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ (Intel Company) సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా 15 శాతం ఉద్యోగులను అంటే 18,000 మంది ఉద్యోగులను తొలగించుకోబోతున్నట్టు వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా కంపెనీ నిర్ణయం తీసుకున్నది. కాగా ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఆ కంపెనీతో ఇబ్బంది
చిప్ లకు కేరాఫ్ గా నిలిచిన ఇంటెల్ కొన్ని దశాబ్దాలపాటు ల్యాప్ టాప్ ల నుంచి డేటా సెంటర్ ల వరకు ఆధిపత్యం చెలాయించింది. అయితే వినూత్న ఆవిష్కరణలతో దూసుకుపోతున్న ఎన్వీడియా, ఏఎమ్‌డీ, క్వాల్ కామ్ ల నుంచి ఇంటెల్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏఐ ప్రాసెసర్ లతో వచ్చిన ఎన్వీడియా నుంచి ఇంటెల్ కంపెనీకి ఎదురుదెబ్బ తగులుతున్నట్టు పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.