Skill University

Hyderabad, AUG 01: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో స్కిల్ యూనివర్సిటీకి (Skill University) సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్ వర్సీటీ ఆఫ్ తెలంగాణగా నామకరణం చేసింది ప్రభుత్వం. శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా (Net Zero City) నామకరణం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో మరోసారి సిటీ నిర్మాణం కాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోని నిరుద్యోగులు, యువతకు మరింత వృత్తి నైపుణ్యం పెంచేలా ఈ యూనివర్సిటీలో కోర్సులు ఉండనున్నాయి. రాష్ట్రంలో కొత్తగా వచ్చే కంపెనీలకు అవసరమయ్యే స్కిల్స్ ను పెంపొందించే విధంగా ఈ యూనివర్సిటీలో 17 కోర్సులను అందుబాటులోకి రానున్నాయి.

 

”ప్రజా ప్రభుత్వం గొప్ప ఆశయంతో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తున్నాం. ఎక్కడైనా నగరం అభివృద్ధి కావాలి అంటే అక్కడ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాం. తెలంగాణ ఉద్యమం నిరుద్యోగ సమస్య. యువత డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ వారికి స్కిల్స్ ఉండటం లేదు. కష్టపడి చదివి పట్టాలు పట్టుకొని హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న వారికి స్కిల్స్ ఉండటం లేదు. యువతకు స్కిల్స్ అందించడం కోసం కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.

 

తెలంగాణను అభివృద్ధి చేసింది, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్ తో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు శిక్షణ ఇస్తాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సీటు వస్తే ఉద్యోగం వస్తుందని నేను హామీ ఇస్తున్నా. సికింద్రాబాద్, హైదరాబాద్ ను.. బ్రిటిష్ వారు, సైబరాబాద్ ను చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి నిర్మాణం చేశారు. ఇక్కడ కొత్త సిటీని మా ప్రభుత్వం, మా మంత్రివర్గం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ పర్యాటక పరంగా, పారిశ్రామిక పరంగా, హెల్త్ పరంగా, విద్య పరంగా నిర్మాణం చేస్తాం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. నాలుగేళ్లు తిరిగేలోపు అద్భుతమైన నగరం నిర్మాణం చేస్తాం. భూములు పోయిన వారు బాధపడకండి. ఇక్కడ మీ పిల్లలకు స్కిల్స్ నేర్పుతాం, ఉపాధి కల్పిస్తాం. ఇక్కడ రోడ్లు అభివృద్ధి చేస్తాం. ఔటర్ ద్వారా మన భూముల రేట్లు పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర్ రెడ్డి వేస్తే రీజినల్ రింగ్ రోడ్ మన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో నిర్మాణం చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారతాయి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.