Reliance Jio: జియోకి షాకిచ్చిన యూజర్లు, భారీగా క్షీణించిన కొత్త వినియోగదారుల సంఖ్య, బీఎస్‌ఎన్‌ఎల్ కంటే వెనకే, వివరాలను వెల్లడించిన ట్రాయ్
టారిఫ్ సవరింపు కారణంగా డిసెంబరు నెలలో జియో కొత్త వినియోగదారుల సంఖ్యలో భారీగా క్షీణించిందని ట్రాయ్ (Telecom Regulatory Authority of India (TRAI) వెల్లడించింది.
New Delhi, Febuary 26: ఉచిత సేవలతో దేశీయ టెలికాం పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియోకు (Reliance Jio) తాజాగా పెద్ద షాక్ తగిలింది. టారిఫ్ సవరింపు కారణంగా డిసెంబరు నెలలో జియో కొత్త వినియోగదారుల సంఖ్యలో భారీగా క్షీణించిందని ట్రాయ్ (Telecom Regulatory Authority of India (TRAI) వెల్లడించింది.
నవంబరు నెలలో 5లక్షల 60 వేల కొత్త చందారులను జత చేసుకున్న జియో డిసెంబర్ నెలలో 82,308 మంది ఖాతాదారులను మాత్రమే నమోదు చేసింది. ఈఈ విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కంటే వెనకపడటం విశేషంగా చెప్పుకోవచ్చు.
మరోవైపు ఏజీఆర్ బకాయిలతో సంక్షోభంలో పడ్డ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) చందాదారుల విషయంలో కూడా ఎటువంటి పురోగతి లేదు. తాజా ట్రాయ్ నివేదిక ప్రకారం వొడాఫోన్ ఐడియా డిసెంబర్ 31తో ముగిసిన నెలలో 36,44,453 మంది సభ్యులను కోల్పోయింది. ఇది నవంబర్ నెలలో కోల్పోయిన 3,64,19,365 కంటే చాలా తక్కువ.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డిసెంబర్ 31, 2019తో ముగిసిన నెలలో భారతీయ టెలికాం కంపెనీల చందాదారుల డేటాను బుధవారం విడుదల చేసింది. జియో గత ఏడాది డిసెంబర్‌లో తన టారిఫ్ పెంపును ప్రవేశపెట్టడమే సబ్ స్కైబర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం కావచ్చని పేర్కొంది. కాగా కంపెనీ మార్కెట్ వాటా పుంజుకుంది. నవంబర్ 2019 చివరిలో 32.04 శాతంతో పోలిస్తే 32.14 శాతానికి పెరిగింది.
ఒక్కసారి రీఛార్జ్ చేయండి, 336 రోజుల పాటు అపరిమిత ప్రయోజనాలు పొందండి
వోడాఫోన్-ఐడియా మార్కెట్ వాటా నవంబర్‌లో 29.12 శాతం నుండి డిసెంబర్‌లో 28.89 శాతానికి తగ్గింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నెలలో సుమారు 4,26,958 మంది కొత్త చందాదారులను చేర్చుకుంది. నవంబర్ 2019 నెలలో 3,38,480 మంది మాత్రమే. దీని మార్కెట్ వాటా ఒక నెలలో 10.19 శాతం నుండి 10.26 శాతానికి పెరిగింది. 2 019 చివరి నెలలో ప్రవేశపెట్టిన సుంకం పెంపు కారణంగా మొత్తం చందాదారుల వృద్ధి మందగమనంలో ఉందని ట్రాయ్ వెల్లడించింది.
అయినప్పటికీ రిలయన్స్ జియో ఇప్పటికీ మార్కెట్ వాటాలో 32.14 శాతంతో టాప్‌లో ఉండగా, వొడాఫోన్ ఐడియా 28.89 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంది. 28.43 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో ఎయిర్ టెల్ వుంది.
ఎయిర్‌టెల్ డిసెంబర్ నెలలో చందాదారులను కోల్పోయినా ఈ సంఖ్య 11,050 వద్ద స్థిరంగా ఉంది. మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 2019 నవంబరులో 1,154.59 మిలియన్ల నుండి 2019 డిసెంబర్ చివరినాటికి 1,151.44 మిలియన్లకు తగ్గింది. తద్వారా నెలవారీ క్షీణత రేటు 0.27 శాతం.