Another International Award For Balagam: విశ్వ వేదికపై దూసుకుపోతున్న మన ‘బలగం’.. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన సినిమాకు మరో అంతర్జాతీయ పురస్కారం..
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బలగం పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా బలగం చూశావా? అని ఒకరికొకరు అడుగుతున్నారు.
Hyderabad, April 3: తెలంగాణ (Telangana) సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన బలగం (Balagam) విశ్వ వేదికలపై సత్తా చాటుతున్నది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా బలగం పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా బలగం చూశావా? అని ఒకరికొకరు అడుగుతున్నారు. అంతలా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయిందీ ఈ అచ్చ తెలుగు, తెలంగాణ సినిమా. పల్లెటూరి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, యాస, భాషలను సిల్వర్ స్ర్కీన్‌పై అద్భుతంగా చూపించాడు మొదటిసారి మెగాఫోన్ పట్టుకున్న వేణు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను చూపించిన తీరు అందరనీ కట్టిపడేస్తోంది. అందుకే తెలంగాణలోని పలు పల్లెల్లో.. ఒకప్పటిలా గ్రామస్థులంతా కలిసి చూసే విధంగా తెరలు కట్టి 'బలగం' ను ప్రదర్శిస్తున్నారు. ఇలా ఓ వైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో దూసుకుపోతోన్న ఈ సినిమాకు అవార్డుల పంట పండుతోంది. కొన్ని రోజుల క్రితం బలగం చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్‌ఫిల్మ్‌ఆటోగ్రఫీ విభాగాల్లో లాస్‌ఏంజిల్స్ ఫోటోగ్రఫీ అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగు వేదిక నుంచి ఉగాది పురస్కారాల నంది అవార్డునూ దక్కించుకుంది. తాజాగా బలగం ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చి చేరింది.
మొత్తం ఎన్ని అవార్డులంటే?
ఉక్రెయిన్ కి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో ఇండియా నుంచి బెస్ట్ ఫీచర్ చిత్రంగా 'బలగం' పురస్కారం కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఇప్పటివరకు తమకు నాలుగు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇక హీరో ప్రియదర్శి 'ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం' అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో ఈ విషయాన్ని పంచుకుని మురిసిపోయాడు.