Vijay Debut Into Instagram (PIC @ Vijay Instagram )

Chennai, April 02: ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న దక్షిణాది హీరోల జాబితాలో మొదటి స్థానంలో ఉంటాడు కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ (Vijay). దళపతి విజయ్‌గా కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎప్పటికపుడు సోషల్‌మీడియా ద్వారా అప్‌డేట్స్ షేర్ చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. విజయ్‌ పాపులర్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో ఖాతా ఓపెన్‌ చేశాడు. సూపర్ కూల్‌ లుక్‌ ఒకటి పోస్ట్‌ చేస్తూ.. అందరికీ హలో చెప్పాడు. విజయ్‌ ఇలా ఎంట్రీ ఇచ్చాడో..? లేదో..? లక్షల్లో ఫాలోవర్లు చేరిపోయారు. విజయ్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. విజయ్‌ ఇప్పటివరకు ట్విట్టర్ ద్వారా తన అప్‌డేట్స్‌ను అందరితో పంచుకునేవాడు. ట్విట్టర్‌లో కూడా రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటాడు విజయ్‌. ఈ స్టార్ యాక్టర్‌ ట్విట్టర్‌లో ఒక్క పోస్ట్‌ పెట్టాడంటే చాలు క్రేజ్‌ మాత్రం మామూలుగా ఉండదు. మరి ఇప్పుడిక సూపర్ యాక్టివ్‌గా ఉండే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విజయ్‌ ఎలాంటి క్రేజీ అప్‌డేట్స్ ఇస్తాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.

ఈ ఏడాది వారిసుతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌ టైనగర్‌గా వస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet)లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.