Sai Pallavi Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రలో సాయిపల్లవి, కుటుంబంతో సహా మహాదేవున్ని దర్శించుకున్న హీరోయిన్, అమర్‌నాథ్ యాత్ర విశేషాలు ఇన్‌స్టాలో పోస్ట్
కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఈ యాత్రకు వెళ్లి వచ్చిన ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఈ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు మానసికంగా పలు పరీక్షలు పెట్టిందన్నారు
Jammu, July 15: పరమ పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రలో నటి సాయిపల్లవి (SaiPallavi) పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఈ యాత్రకు వెళ్లి వచ్చిన ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఈ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు మానసికంగా పలు పరీక్షలు పెట్టిందన్నారు. తిరుగు ప్రయాణంలో మాత్రం ఓ దృశ్యం తన మనసును కట్టిపడేసిందని తెలిపారు. ‘‘వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి నేను పెద్దగా ఆసక్తి చూపించను. కానీ అమర్‌నాథ్ యాత్ర తీర్థయాత్ర (Amarnath Yatra) గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఎంతోకాలం నుంచి వెళ్లాలని కలలు కన్న యాత్ర ఇది. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఈ యాత్రకు తీసుకువెళ్లడం ఎన్నో సవాళ్లు విసిరింది. కొన్నిసార్లు వాళ్లు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతూ ఛాతి పట్టుకోవడం.. దారి మధ్యలో అలిసిపోవడం వంటి పరిస్థితులు చూసి.. ‘స్వామీ.. మీరు ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు?’ అని ప్రశ్నించేలా చేశాయి. దైవ దర్శనం అనంతరం నా ప్రశ్నకు సమాధానం దొరికింది. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు మనసుని హత్తుకునే దృశ్యాన్ని చూశా.
యాత్రను కొనసాగించలేక పలువురు యాత్రికులు ఇబ్బందిపడుతూ ఉండగా.. వాళ్లలో ధైర్యం నింపడం కోసం చుట్టు పక్కన ఉన్నవాళ్లందరూ ‘ఓం నమః శివాయా’ అంటూ ఆ స్వామి నామాన్ని గట్టిగా స్మరించారు. వెళ్లలేం అనుకున్న యాత్రికులు కూడా ఒక్కసారిగా స్వామి వారిని తలచుకుని ముందుకు అడుగులు వేశారు. మాలాంటి లక్షలాది మంది భక్తులకు ఈ యాత్రను చిరస్మరణీయం చేసిన శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డులోని ప్రతి ఒక్కరికీ నా ప్రణామాలు! అలాగే, మమ్మల్ని అన్నివేళల్లో సంరక్షిస్తున్న ఆర్మీ/సీఆర్‌పీఎఫ్/పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు.
నిస్వార్థ సేవలకు ఇది సాక్షిగా నిలుస్తుంది కాబట్టే ఈ ప్రదేశం శక్తిమంతమైంది. సంపద, అందం, పవర్‌తో సంబంధం లేకుండా ఇతరులకు సాయం చేయడమే ఈ భూమిపై మన ప్రయాణానికి ఒక విలువని ఇస్తుంది. ఈ అమర్‌నాథ్ యాత్ర నా సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు నా ధైర్యాన్ని పరీక్షించింది. మన జీవితమే ఒక తీర్థయాత్ర అని తెలిసేలా చేసింది. మనిషిగా ఉన్నందుకు ఎదుటి వ్యక్తులకు సాయం చేయకపోతే మనం చనిపోయిన వాళ్లతో సమానమని తెలియజేసింది’’ అని సాయిపల్లవి పోస్ట్ పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘విరాటపర్వం’, ‘గార్గి’ తర్వాత సాయిపల్లవి కెమెరా ముందు కనిపించలేదు. శివ కార్తికేయన్‌తో ఆమె ఓ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు సమాచారం.