Dil Bechara: 'పుట్టుక, చావు మన చేతుల్లో లేవు కానీ ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉంది'! కంటతడి పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్
ఒక రాణి, ఇద్దరు చనిపోయారు.. కథ సమాప్తం'! అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా జూలై 24న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ షో వేయబడుతోంది...
'ఒక రాజు.. ఒక రాణి, ఇద్దరు చనిపోయారు.. కథ సమాప్తం'! అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా జూలై 24న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ షో వేయబడుతోంది. ఈ చిత్రంలో సంజన సంఘి, సైఫ్ అలీ ఖాన్, స్వస్తిక ముఖర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు ముఖేష్ ఛబ్రా ఈ సినిమాను 2012లో బెస్ట్ సెల్లర్ గా నిలిచిన జాన్ గ్రీన్ అనే అమెరికన్ రచయిత రచించిన 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' అనే నవల ఆధారంగా రూపొందించారు.
వాస్తవానికి ఈ సినిమా మే 8న థియేటర్లలో విడుదల కావాల్సింది, అయితే దేశంలో కరోనావైరస్ మహమ్మారి కారణంగా చిత్రం విడుదల వాయిదాపడింది. చివరకు 'దిల్ బెచారాను' డిజిటల్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటింది.
కథ విషయానికి వస్తే రాజ్ కుమార్ అనే యువకుడికి మరియు కిజీ బసు అనే యువతికి మధ్య నడిచే స్నేహం, వారి మధ్య జరిగే చిన్నిచిన్ని గొడవలు, వన్ సైడ్ లవ్ లాంటి సున్నితమైన అంశాలతో రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే కొంత అర్థమవుతోంది. ఇందులో హీరోయిన్‌కి క్యాన్సర్, హీరో సుశాంత్ రాజ్‌పుత్ పాత్ర చాలా కేర్ ఫ్రీగా, ఉల్లాసంగా జీవితంలో ముందుకెళ్లే యువకుడిగా కనిపిస్తుంది.
'పుట్టుక ఎప్పుడు, చావు ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, కానీ ఎలా బ్రతకాలి అనేది మన చేతుల్లోనే ఉంది' అని సుశాంత్ చెప్పే డైలాగ్ అతడి అభిమానులను కంటతడి పెట్టించేలా ఉంది. గతనెల జూన్ 14న సుశాంత్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.
సినిమా విడుదల దగ్గరపడుతున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందో మీరే చూడండి.
Sushant Singh Rajput's #DilBechara Trailer:
దిల్ బెచారా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ముఖేష్ ఛబ్రా భావోద్వేగానికి లోనయ్యారు, తన ప్రియమైన స్నేహితుడు సుశాంత్ లేకుండా ఈ చిత్రాన్ని విడుదల చేయవలసి ఉంటుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చిత్రం నుండి ఒక పోస్టర్‌ను పంచుకుంటూ, “ దర్శకుడిగా నా తొలి చిత్రానికి సుశాంత్ హీరో మాత్రమే కాదు, అతను ప్రియమైన స్నేహితుడు, నా ప్రతి అడుగులో తాను నాకు అండగా నిలబడ్డాడు. నాపై అపారమైన ప్రేమను కనబరిచాడు. మేము 'కై పో చే' నుండి 'దిల్ బెచారా' వరకు కలిసి పని చేశాము. నా డెబ్యూ చిత్రంలో నటిస్తానని వాగ్దానం చేశాడు, మాట నిలుపుకున్నాడు. సుశాంత్ ఎంత ప్రతిభావంతుడో! ఆయన ప్రతిభను వేడుక చేసుకోటానికి ఈ సినిమా ఇప్పుడు అందరి ముందుకు వచ్చేస్తోంది" అంటూ పేర్కొన్నారు.
'సుశాంత్ పైనుంచి తన అందమైన చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, లవ్ యూ సుశాంత్' అని డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ట్వీట్ చేశారు.