Sushant Singh Rajput (Photo Credits: Twitter)

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన అపార్టుమెంట్ లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అతడు బలవన్మరణాని పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది మిస్టరీగా మారింది. బాలీవుడ్ లో 'కాయ్‌ పో చే’ సినిమాతో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్‌ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎం.ఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

ఇప్పటివరకు సుశాంత్ శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, PK, డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి, రాబ్తా, వెల్‌కమ్‌ న్యూయార్క్, కేదార్‌నాథ్, సోంచారియా, చిచోరే తదితర చిత్రాలలో నటించాడు. సుశాంత్ చివరగా నెట్ ఫ్లెక్స్ ఒరిజినల్స్ కోసం 'డ్రైవ్' అనే చిత్రంలో నటించాడు.

బాలీవుడ్‌లో తమ కెరీర్‌ను విజయవంతంగా మలుచుకున్న కొద్దిమంది టీవీ నటులలో సుశాంత్ ఒకరు. తన టాలెంట్‌తో మంచి ప్రశంసలు అందుకుంటూ కెరీర్‌లో ఇప్పుడిప్పుడే మంచి హీరోగా ఎదుగుతున్న సమయంలో సుశాంత్ ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడటం అతడి ఫ్యాన్స్‌ను, బాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.

 

సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అణ్వేషిస్తున్నారు. ఇటీవలే సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే తర్వాత అది ఆత్మహత్య కాదు, ప్రమాదవషాత్తూ బిల్డింగ్ నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆమె కూడా కొద్ది రోజులుగా  వ్యక్తిగత కారణాలతో డిప్రెషన్‌లో ఉందని తెలిసింది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సుశాంత్ మరణవార్త రావటం పలు సందేహాలను రేకేత్తిస్తోంది.

సుశాంత్  కూడా డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అతడి సన్నిహితులు  చెబుతున్నారు.  పోలీసులు ఈ ఘటనను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి సుశాంత్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే గానీ ఏదీ చెప్పలేమని చెబుతున్నారు.

ఏదైమైనా ఒక బాలీవుడ్ యంగ్ హీరో, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హీరో ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరం అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాని, అతడి కుటుంబ సభ్యులకు దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని బాలీవుడ్ స్టార్స్ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.