Vijay Deverakonda : 'అకౌంట్లో సరిపోయే డబ్బుల్లేవు, అయినా నాకేం కొత్త కాదు'.. కరోనావైరస్ సంక్షోభంలో దెబ్బతిన్న వారికి రూ. 1.30 కోట్ల ఫండ్‌తో సహాయం ప్రకటించిన విజయ్ దేవరకొండ

అందులో తానూ ఒకడినని, తనకు కూడా గట్టిగానే దెబ్బ తగిలిందని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. తన అకౌంట్లో కూడా సరిపోయే డబ్బుల్లేవని......

Vijay Deverakonda

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. అందులో తానూ ఒకడినని, తనకు కూడా గట్టిగానే దెబ్బ తగిలిందని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నారు. తన అకౌంట్లో కూడా సరిపోయే డబ్బుల్లేవని, అయితే తన దగ్గర డబ్బు లేకపోవడం ఇదేం కొత్తేం కాదు, కానీ గత రెండేళ్లుగా ప్రొడక్షన్ హౌజ్ పెట్టడం, ఫౌండేషన్ పెట్టి సహాయం చేయడం, అందుకు సిబ్బంది పెరిగి వారికి జీతాలివ్వడం తనకు కొత్త అని, వారందరూ తన బాధ్యత అని విజయ్ చెప్పుకొచ్చాడు. అయినా తానెప్పుడు భయపడలేదని, ఇప్పటికీ ఉన్నంతలో తన పరిస్థితి బాగానే ఉందని విజయ్ అన్నారు. అయితే తనకే ఇలాంటి పరిస్థితులు ఉంటే బయట ఎంతో మంది ఈ సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, కొంతమంది జాబ్స్ కోల్పోవడం లాంటి వార్తలు తనను ఇబ్బంది పెడుతున్నాయని అందుకే వారి కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో రెండు పెద్ద ఆలోచనలతో ముందుకొచ్చినట్లు విజయ్ దేవరకొండ ప్రకటించారు.

అందులో ఒకటి ప్రస్తుత అవసరాలు తీర్చడం కాగా, రెండోది భవిష్యత్ అవసరాలు తీర్చడం. ఇందుకోసం రూ. 1.30 కోట్ల ఫండ్ తో వివిధ రూపాలలో సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ పేర్కొన్నారు. తన టీమ్ అందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రస్తుత అవసరాల కింద నిత్యవసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం రూ. 25 లక్షలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్' (ఎం.సి.ఎఫ్‌) ఏర్పాటు చేశారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత భవిష్యత్తులో యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్‌ దేవరకొండ ఫౌండేషన్' (టి.డి.ఎఫ్‌) ను ఏర్పాటు చేశారు. రూ. 1 కోటితో ప్రారంభమైన ఈ టీడీఎఫ్‌ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులను, నిరుద్యోగులను ఎంపిక చేసి వారికి ఎలాంటి ఖర్చు లేకుండా అవసరమయ్యే ట్రైనింగ్ ఇప్పించి, వారికి ఉద్యోగాలు కల్పించడం తమ బాధ్యత అని విజయ్ తెలిపారు. అసలు ఈ ఫౌండేషన్ ఎప్పుడో ఏర్పాటు చేసి, ఇప్పటికే 120 మందిని ఎంపిక చేసి వారి కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నామని. భవిష్యత్ లో కనీసం అలా లక్ష మందికి ఉద్యోగాలు లభించేలా తీర్చిదిద్దటం తన టార్గెట్ అని విజయ్ చెప్పుకొచ్చారు.

Two Big Announcements Made By Vijay Deverakonda

ప్రస్తుతం కనీస అవసరాల కోసం www.thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే తమ ఫౌండేషన్ సభ్యులే స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారు, లేదా తామంతట తామే దగ్గరలోని కిరాణ షాపుకు వెళ్లి కొనుగోలు చేస్తే ఫౌండేషన్‌ సభ్యులే డబ్బు చెల్లిస్తారు. ఈ రూ. 25 లక్షలతో కనీసం 2 వేల కుటుంబాల అవసరాలు తీర్చడమే తమ లక్ష్యం పెట్టుకున్నట్లు విజయ్‌ దేవరకొండ తెలిపారు.

"ప్రస్తుత సంక్షోభం మనం ఊహించింది కాదు, మనమెవరం దీనికి సిద్దంగా కూడా లేము. కానీ మనమంతా ఫైటర్స్, మనం ఈ కష్టకాలన్ని అధిగమించి గెలుస్తాం" అంటూ విజయ్ ధైర్యాన్నిచ్చే మాటలు చెప్పారు.